కలం, కరీంనగర్: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తండ్రి దివంగత పొన్నం సత్తయ్య (Ponnam Sathaiah) 16వ వర్ధంతి కార్యక్రమం బుధవారం కరీంనగర్‌లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వారి తోటలో ఉన్న పొన్నం సత్తయ్య ఘాట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. మంత్రి తన సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీసు కమిషనర్ గౌస్ ఆలం, మాజీ ఎమ్మెల్యేలు నాగుల సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ప్రణవ్ ఒడితల ఘాట్ వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, రవాణా, బీసీ సంక్షేమ శాఖల అధికారులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కుటుంబ సభ్యులు పొన్నం సత్తయ్య అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ప్రజాసేవా స్ఫూర్తి, ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

