కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్ నినో ఎఫెక్టు రైతన్నలకు శాపంగా మారింది. వర్షాలు లేక సాగు చేసిన పంటలు కళ్ళ ముందే ఎండిపోతుంటే రైతన్న గుండె తరుక్కుపోతోంది. ఓ వైపు వర్షాలు కురవక… మరో వైపు కరెంట్ కోతలు అన్నదాతలను ఆగమాగం చేస్తోంది.సాగు చేసిన పంటలను కాపాడుకోలేక వర్షం కోసం ఆకాశం వైపు ఆశ గా చూస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో రోజురోజుకు ఎండలు మండుతుండడం తో సాగు చేసిన పంటలు చేసికొచ్చే సూచనలు కనిపించుట లేదు.
రైతుల ఆందోళనలు..
ఈ ఏడాది ఎల్ నినో ఎఫెక్ట్ తో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా క్రమ క్రమంగా కరువు చాయలు కమ్ముకుంటున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం తమ కమతాల్లో పూర్తిస్థాయిలో పంటలు సాగు చేయలేకపోయారు. వర్షాలు కురవకపోవడంతో సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి రైతాంగం సతమతమవుతూ, చివరకు చేతులెత్తేశారు. వేసవి కాలాన్ని తలపిస్తూ అధిక ఎండలు, కరెంటు కోతలు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరెంట్ ను కోతలు లేకుండా సరఫరా చేయాలని రైతులు ఆందోళన బాట పట్టారు.
ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యం!
ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య లే శరణ్యమని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఖరీఫ్ లో సాధారణ సాగు విస్తీర్ణం 21.32 లక్షల ఎకరాలు కాగా, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు 16.32 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. అంటే సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాలేదు. ఈ 16.32 లక్షల ఎకరాల్లో ఎక్కువగా కాలువలు, బోరుబావుల ఆధారంగా వేసిన పంటలే ఉన్నాయి.
ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగా కురువలేదు. ఎప్పటి మాదిరిగానే ఆశతో అన్నదాతలు వరి ,పత్తి, జొన్న, మొక్కజొన్న తో పాటు కంది, మినుము, పెసర తదితర ఆరుతడి పంటలు సాగు చేసినప్పటికీ వర్షాభావ పరిస్థితుల్లో పంటల్ని కాపాడుకునే పరిస్థితి కనిపించడం లేక అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
ఒక్క పత్తి పంట ద్వారానే రూ. 500 కోట్ల మేర నష్టం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పత్తి పంటను అధికంగా పండించేందుకు రైతాంగం మొగ్గుచూపుతున్నారు. దశాబ్దాల కాలంగా పత్తి పంటను విస్తారంగా పండించేందుకు రైతన్నలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 8 లక్షల ఎకరాలు కాగా, ఈ దఫా వర్షాలు సరిగ్గా కుర్వనందున కేవలం నాలుగు లక్షల ఎకరాల్లోనే పత్తి పంటను సాగు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పత్తి పంట దిగుబడిని పరిశీలిస్తే ఒక్కో ఎకరాకు సుమారుగా 15 నుంచి 20 కింటాల వరకు దిగుబడి వచ్చేది. ఈ ఏడాది పంటలు సరిగా ఎదగక గిరిస బారిపోయాయి. దీంతో ఎకరా ఒక్కంటికి రెండు నుంచి ఐదు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశాలు కూడా లేవు.
ఒక్కో ఎకరాకు పత్తి దిగుబడి సుమారు 10 నుంచి 15 కింటాలు వేసుకున్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.7500 రూపాయలుగా వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో సాగుచేసిన పత్తి పంట ప్రస్తుతం రైతుకు చేతికి దక్కే పరిస్థితుల్లో లేదు. దీంతో ఈ ఏడాది పత్తి పంట మూలంగా భారీ ఎత్తున రైతాంగం నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.500కోట్ల మేర పత్తి పంట మూలంగా రైతులు నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే కాలువల ద్వారా నీరు రాకపోతే పూర్తిగా పాలమూరు జిల్లా రైతాంగం వేలకోట్లలో నష్టపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

