కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) జాతీయ విద్యార్థి సంఘం 90వ వార్షికోత్సవ మహాసభలను సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో హన్మకొండ జిల్లా వేదికగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు తెలియజేశారు. బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీలో పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ చేతుల మీదుగా వార్షికోత్సవ “వాల్ పోస్టర్” విడుదల చేశారు.
ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ.. “చదువు – పోరాటం: చదువు! పోరాడు!!” అనే నినాదంతో విద్యార్థి లోకం పక్షాన నిలబడి పోరాడుతున్న AISF.. 90 ఏళ్ల ఘనమైన చరిత్రను పూర్తి చేసుకుంటోందని అన్నారు.సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో హన్మకొండ వేదికగా జరిగే ఈ వార్షికోత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, మేధావులు, పూర్వ ఏఐఎస్ఎఫ్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వార్షికోత్సవాల్లో విద్యారంగంలో ఎదురవుతున్న సవాళ్లు, విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని స్పష్టం చేశారు.
విద్యారంగాన్ని బ్రష్టు పట్టిస్తోన్న ప్రభుత్వాలు..
నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు మండిపడ్డారు. పేదవాడు చదువుకోవాలంటే లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పాలకుల విధానాల వలన దేశవ్యాప్తంగ ఉన్న బడుగు , బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయకుండా, మోసపూరిత మాటలతో ప్రభుత్వాలు తమ పబ్బం గడుపుకొంటున్నాయన్నారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ విద్యకు సరైన నిధులు కేటాయించకుండా, వసతులు కల్పించకుండా పేద, మద్య తరగతి విద్యార్థుల పట్ల, వారి భవిష్యత్తు పట్ల తమ వంతు సహకారాన్ని, ప్రోత్సహాన్ని అందించకుండా సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నాయని దుయ్యబట్టారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 10+2+3 కి బదులుగా 5+3+3+4 నూతన జాతీయ విద్యా విధానం తీసుకవచ్చి విద్యను ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ, కాషాయీకరణ చేయడానికి కుట్ర చేస్తోందని రాజు ఆరోపించారు. విద్యార్థులకు స్పూర్తి అయిన పూలే, భగత్ సింగ్, అంబేద్కర్, పెరియార్, నారయణ గురు వంటి వారి జీవిత చరిత్రలను, డార్వీన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాలనుంచి తొలగించి బ్రిటీష్ వారికి తొత్తుగా వ్యవహరించిన సావర్కర్ జీవిత చరిత్రలను చేర్చి, దేశ చరిత్రను వక్రీకరిస్తున్నారు.
విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు..
బాల్యం నుంచే విద్యార్థుల మెదుడుల్లోకి మతతత్వ భావజాలాన్ని నింపుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల మధ్య మత విభజన చేయడానికి హిజాబ్ వంటి అంశాలతో రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు. విశ్వ విద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పేరుతో పేద విదార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారని అన్నారు. మెడికల్ ఎంట్రన్స్ (నీట్) ను ప్రాంతీయ భాషలలో నిర్వహించక పోవడం వలన దక్షణాదిన ప్రతిభవున్న విద్యార్థులు సైతం నీట్ లో అర్హత సాధించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్లు లీకుల వల్ల లక్షలాది మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
హామీలపై కాలయాపన చేస్తున్నారు..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని రాజు ఫైర్ అయ్యారు. విద్యారంగంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, భోదనేతర సిబ్బంది, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌళిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గురుకులాల్లో, సాంఘీక సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా, విద్యార్థి మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని దుయ్యబట్టారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయడం లేదని రాజు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటూ విద్యా దోపిడి చేస్తూ విద్యను వ్యాపారమయంగా మార్చారని మండిపడ్డారు. ప్రైవేట్, కార్పోరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం అమలు కావడంలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పోరేట్ విద్యా సంస్థల కబంద హస్తాల్లో ఉంటూ వారు చేస్తున్న ఫీజుల దోపిడి పట్ల చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఆసరగా ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ , స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శి రాజశేఖర్, లక్ష్మణ్, జిల్లా నాయకులు శేఖర్, వీరేష్, పాలమూరు యూనివర్సిటీ నాయకులు పవన్ రెడ్డి, ఉదయ్ కిరణ్, శివ, యాదగిరి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

