కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా.. కవులు, కళాకారులకు పుట్టిల్లని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Minister Bandi Sanjay Kumar) కొనియాడారు. దేశమంతటా పర్యటించినా కరీంనగర్‌లో ఉన్నంతమంది ప్రతిభావంతులైన కవులు, కళాకారులు మరెక్కడా లేరని, అలాంటి ప్రాంతానికి ఎంపీగా, కేంద్ర మంత్రిగా సేవ చేయడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు.
బుధవారం మంకమ్మ తోటలోని సాయి మానేరు స్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో SRR కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్, లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి సమకాలీన అంశాలపై రచించిన ‘మధుపాలీస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్’ పుస్తకాన్ని బండి సంజయ్ ఆవిష్కరించారు.
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. 400 పేజీల సమాచారంతో రూపుదిద్దుకున్న ఈ పుస్తకం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు, విద్యా సంస్థలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా డాక్టర్ మధుసూదన్ రెడ్డి సమాజానికి ఉపయోగపడే అద్భుతమైన ఆర్టికల్స్ రాస్తున్నారని అభినందించారు.
మోదీ జీవిత చరిత్ర తెలుగులోకి రావాలి
ఒకనాడు వీసా నిరాకరించిన దేశాలే నేడు ప్రధాని నరేంద్ర మోదీకి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నాయని, ప్రతి భారతీయుడు గర్వపడేలా ఆయన పాలన సాగుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు. మోదీ ప్రస్థానంపై డాక్టర్ మధుసూదన్ రెడ్డి తెలుగు ప్రజల కోసం సమగ్రమైన పుస్తకం రాయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని జన్మదినం సందర్భంగా కేంద్ర పథకాల లబ్ధిదారులందరూ ఇళ్ల వద్ద ఆశీర్వాద దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ చల్ల హరిశంకర్, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మానేరు స్కూల్స్ అధినేత అనంత రెడ్డి, టీబీఎస్ఎస్ అధ్యక్షులు దాస్యం సేనాధిపతి తదితరులు పాల్గొన్నారు.

