ఇల్లు ఎంత శుభ్రం చేసినా బ్యాడ్ స్మెల్ వస్తోందా? అసలు కారణం ఇదే

కలం, వెబ్‌డెస్క్: మనం రోజంతా రకరకాల పనుల నిమిత్తం బయటికి వెళ్లి అలసిపోయి ఇంటికి వస్తుంటాం. ఇల్లు మనకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కానీ కొన్నిసార్లు ఇంట్లో వచ్చే దుర్వాసన (Bad Smell) వల్ల చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే, ఈ బ్యాడ్ స్మెల్‌ను పోగొట్టేందుకు చాలా మంది రూమ్ స్ప్రేలు, అగర్‌బత్తీలు ఉపయోగిస్తుంటారు. దీనివల్ల తాత్కాలిక ఉపశమనం దొరికినప్పటికీ.. దుర్వాసనకు గల అసలు కారణాన్ని గుర్తించకపోతే ఆ సమస్య మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. ఇంటి దుర్వాసనను పోగొట్టే కొన్ని టిప్స్ (Cleaning Tips) తెలుసుకుందాం.

అసలు ఇంట్లో దుర్వాసన ఎందుకు వస్తుంది? పరిష్కార మార్గాలు

కిచెన్ శుభ్రత

ఇంట్లో దుర్వాసనకు ప్రధాన కారణం అపరిశుభ్రమైన కిచెన్. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్‌లో కొంత మంది వంట చేసిన తర్వాత స్టవ్ చుట్టూ పడిన ఆహార అవశేషాలు, సింక్‌లో పేరుకుపోయిన వ్యర్థాలు, డ్రైనేజ్ పైపులు సమయానికి శుభ్రం చేయరు. దీనివల్ల ఇంట్లో దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి రోజూ వంట పూర్తయిన వెంటనే కిచెన్ ప్లాట్ ఫామ్, సింక్ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు.

చెత్త బుట్ట నిర్వహణ

చెత్త బుట్ట కూడా ఇంట్లో దుర్వాసనకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. చాలామంది చెత్తను రెండు లేదా మూడు రోజుల పాటు అలాగే ఉంచేస్తుంటారు. మనం చెత్తలో మిగిలిపోయిన ఆహార పదార్థాలు వేస్తుంటాం. చెత్తను ఎక్కువ రోజులు ఉంచడం వలన ముఖ్యంగా ఆహార వ్యర్థాలు ఎక్కువసేపు ఉంటే బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది. కాబట్టి చెత్త బుట్టను తరచూ ఖాళీ చేయడం, వారానికి ఒకసారి శుభ్రం చేయడం మంచిది.

బాత్రూమ్ దుర్వాసన

కొన్నిసార్లు సమస్య గదుల్లో కాకుండా బాత్రూమ్‌లో ఉంటుంది. బాత్రూమ్‌లో తడి ఎక్కువగా ఉండటం, వెంటిలేషన్ సరిగా లేకపోవడం, డ్రైనేజీ సమస్యలు ఉండటం వల్ల బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తుంది. ఈ వాసన ఇల్లు మొత్తం వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు బాత్రూమ్‌ను పొడిగా ఉంచడం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించడం వంటి అలవాట్లు ఉపయోగపడతాయి.

సోఫాలు, కార్పెట్ల శుభ్రత

బయటి నుంచి వచ్చే దుమ్ము, తేమ, పెంపుడు జంతువుల వెంట్రుకలు వంటివి ఇంట్లోని సోఫాలు, కార్పెట్లు, కర్టెన్లు కూడా అబ్‌సర్బ్’ (Absorb) చేసుకుంటాయి. ఇవి కాలక్రమంలో దుర్వాసనను కలిగిస్తాయి. అందుకే వీటిని క్రమం తప్పకుండా వాష్ చేయడం మర్చిపోవద్దు.

ఫ్రిజ్ నిర్వహణ

సాధారణంగా మనం మిగిలి పోయిన ఆహార పదార్థాలను వేస్ట్ చేయడం ఎందుకని ఫ్రిజ్‌లో పెడుతుంటాం. చాలామంది ఇలా ఫ్రిజ్‌లో పెట్టి మర్చిపోతుంటారు. దీనివల్ల పాత కూరలు, గడువు ముగిసిన పదార్థాలు, మూతలు లేకుండా ఉంచిన ఆహారం వల్ల ఫ్రిజ్‌లో వాసన ఏర్పడుతుంది. అది ఇంటి వాతావరణాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. అందుకే ఫ్రిజ్‌ను తరచూ పరిశీలించాలి.

రోజంతా కిటికీలు మూసి ఉంచడం

బయటి శబ్దాలు, దుమ్ము, ధూళి ఇంట్లోకి రావద్దని చాలా మంది ఇంటి కిటికీలు రోజంతా మూసి ఉంచుతారు. దీనివల్ల గాలి సరిగా ప్రసరించదు. దీంతో ఇంట్లో తేమ, దుర్వాసన పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఉదయం లేదా సాయంత్రం కొంతసేపు కిటికీలు తెరిచి ఉంచడం వల్ల తాజా గాలి లోపలికి వచ్చి వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది.

అయితే చాలామంది దుర్వాసనను పోగొట్టేందుకు సువాసన స్ప్రేలు వాడతారు. కానీ అవి సమస్యను పూర్తిగా తొలగించవు. అసలు కారణాన్ని గుర్తించి శుభ్రతపై దృష్టి పెడితేనే మంచి ఫలితం ఉంటుంది. అందుకే ఇంట్లోని ప్రతి మూలను పరిశుభ్రంగా ఉంచడం, తేమ పేరుకుపోకుండా చూడటం, గాలి సరిగా ప్రసరించేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఇల్లు ఎప్పుడూ తాజాగా, ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>