కలం,మహబూబ్‌నగర్ బ్యూరో : వివిధ గ్రామాల్లో చేపడుతున్న భూ సర్వే (Land Resurvey) ప్రక్రియపై గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని జెఎల్‌బీ హరిప్రియ తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్ గ్రామీణ మండలంలోని బొక్కలోనిపల్లి గ్రామంలో జన్నప్పపల్లి గ్రామానికి సంబంధించి చేపడుతున్న భూ సర్వే ప్రక్రియపై గ్రామస్థులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన గ్రామసభ,అవగాహన సమావేశంలో అదనపు కలెక్టర్ హరిప్రియ (Additional Collector Haripriya)పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో భూ రీ-సర్వే ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు. భూముల కొలతలను ఖచ్చితంగా నిర్వహించి, భూహద్దులను స్పష్టంగా నిర్ధారించేందుకు ఆధునిక రోవర్ సర్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు వివరించారు.
భూ రీ-సర్వే పూర్తయిన అనంతరం సంబంధిత భూ యజమానులకు ల్యాండ్ పార్సెల్ మ్యాప్స్ , భూధార్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా భూ రికార్డుల్లో ఖచ్చితత్వం పెరగడంతో పాటు, భూముల సరిహద్దులపై స్పష్టత ఏర్పడుతుందని, భవిష్యత్తులో భూ యాజమాన్యం, భూ హద్దులకు సంబంధించిన వివాదాలను నివారించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. భూ రీ-సర్వే ప్రక్రియ సజావుగా, సమర్థవంతంగా పూర్తయ్యేందుకు గ్రామస్థులు రెవెన్యూ, సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని అదనపు కలెక్టర్ జెఎల్‌బీ హరిప్రియ కోరారు.

