కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జన్మనిచ్చిన తల్లిదండ్రులు దైవంతో సమానం అని, వారిని సేవించుకోవడం మన అదృష్టంగా భావించాలని నారాయణపేట (Narayanpet) జిల్లా సీనియర్ సివిల్ కోర్టు జడ్జి వింధ్య నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ.. తల్లిదండ్రులను వారి పిల్లలు గౌరవించాలని, తల్లిదండ్రులు భగవత్ స్వరూపులని, వారిని సేవించుకోవడం మన అదృష్టమని తెలిపారు.
నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రాముఖ్యత తగ్గిపోతుందని.. ఉమ్మడి కుటుంబానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని, కానీ ఈ రోజుల్లో అందరూ ఉమ్మడి కుటుంబానికి దూరమవుతున్నారని తెలిపారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ, బాగోగులు, మెయింటెనెన్స్, మందులు, ఆహార అవసరాలను, ఇంట్లో ప్రశాంతత కు సరైన సపోర్ట్ ఇచ్చి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ఈ రోజుల్లో మనుషులకు ఇవ్వాల్సిన సమయాన్ని టీవీలు, ఫోన్లకు కేటాయిస్తూ వృద్ధులను వృద్ధాశ్రమాల్లో వదిలివేస్తున్నారని ఆరోపించారు. వారు కూడా వృద్దులు అవుతారనే విషయాన్ని మరిచిపోతున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులు కలిసిమెలిసి వృద్దులకు సమయం కేటాయించి, వారి మనసును బాధపెట్టకుండా చూసుకోవాలని సూచించారు. ఆస్తులు రాయించుకున్న తర్వాత వృద్ధులను హింసించడం, నిరాదరణకు గురిచేయడం, రోడ్లపై వదిలివేయడం వంటి ఘటనలు జరిగితే.. బాధిత వృద్ధులు కోర్టును ఆశ్రయించి కేసు వేస్తే, తల్లిదండ్రుల సంరక్షణ & పోషణ చట్టం-2007 ప్రకారం ఆ ఆస్తులు తిరిగి వృద్ధులకే దక్కుతాయని స్పష్టం చేశారు. వృద్ధులకు ఏవైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ట్రోల్ ఫ్రీ నెంబర్ 15100ను సంప్రదించాలని, ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి బి. సాయి మనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే. అవినాష్, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి మురళీధర్, సీనియర్ న్యాయవాది రఘువీర్ లు మాట్లాడుతూ.. వృద్ధుల సంక్షేమం, వారికి న్యాయపరంగా లభించే చట్టాల గురించి వివరించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కే. లక్ష్మి పతి గౌడ్ ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. ఈ సదస్సుకు న్యాయవాదులు , కమిటీ సభ్యులు కాలప్ప, కుర్మన్న, నారాయణపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు, కోర్టు, లోక్ అదాలత్ సిబ్బంది, పోలీసులు, వయోవృద్దులు, మహిళలు, కక్షిదారులు పాల్గొన్నారు.

