నార్కట్‌పల్లి పీఎస్‌లో బంగారం రికవరీ వివాదం

కలం, నల్లగొండ క్రైమ్: నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ (Narketpally Police Station) పరిధిలో వెలుగుచూసిన బంగారం రికవరీ వ్యవహారం (Gold Recovery Row) ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఒక దొంగతనం కేసులో నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన బంగారు ఆభరణాలలో కొంత భాగాన్ని పక్కదారి పట్టించారనే తీవ్ర ఆరోపణలు రావడం, దానికి బాధ్యుడిగా చేస్తూ నార్కట్‌పల్లి ఎస్ఐ విష్ణుపై ఉన్నతాధికారులు వేటు వేయడం సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారంలో గోల్‌మాల్ జరిగిందన్న వార్తలు ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో తక్షణ చర్యల్లో భాగంగా నార్కట్‌పల్లి ఎస్ఐ విష్ణుని జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే, కేవలం ఎస్ఐ విష్ణుపైనే చర్యలు తీసుకుని ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ రికవరీ పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఎస్ఐ విష్ణుతో పాటు మరొక కీలక అధికారి ప్రమేయం కూడా ఉందంటూ పోలీస్ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. సదరు ఉన్నతాధికారితో ఉన్న ప్రత్యేక సాన్నిహిత్యం కారణంగానే ఆ కీలక అధికారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయనను పూర్తిగా సేవ్ చేసే ప్రయత్నం జరుగుతోందని శాఖ అంతర్గతంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దిగువ స్థాయి అధికారి అయిన ఎస్ఐపై వేటు వేసి, అసలు పాత్రధారుడైన ఉన్నతాధికారి వ్యవహారాన్ని తేల్చకుండా నాన్చుతున్నారని సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థలోనే నమ్మకాన్ని దెబ్బతీసేలా మారిన ఈ బంగారం గాయబ్ వ్యవహారంపై ఉన్నతాధికారులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా శాఖాపరమైన సమగ్ర విచారణ జరుపుతారా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కేవలం ఎస్ఐపై చర్యలతో సరిపెడతారా లేక సూత్రధారులైన ఇతర అధికారుల లీలలనూ బయటకు తీసి కఠిన చర్యలు తీసుకుంటారా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఈ వ్యవహారం ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>