కలం, మెదక్ బ్యూరో: ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టును నిరసిస్తూ ఎఐసీసీ, పీసీసీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కదంతొక్కితే.. ఆందోల్ నియోజకవర్గ శ్రేణులు దూరంగా ఉండటం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి నిరసనలతో హోరెత్తిస్తుంటే.. ఆందోల్‌లో (Andole Congress) మాత్రం పార్టీ కార్యక్రమాలు పూర్తిగా కరువయ్యాయి. సొంత నియోజకవర్గంలో పార్టీ అధిష్ఠానం ఆదేశాలను అమలు చేయడంలో స్థానిక నేత, మంత్రి దామోదర్ రాజనర్సింహ వైఫల్యం చెందారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైకమాండ్ ఇచ్చిన పిలుపును పక్కనబెట్టి, వరుస కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది. మంత్రి నుంచి సరైన దిశానిర్దేశం, నాయకత్వం కొరవడటంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.
దామోదర రాజనర్సింహపై విమర్శలు
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదిక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు ఇతర నేతలు అరెస్టు అయ్యారు. దీంతో కేంద్ర ప్రభుత్వ అరెస్టులకు నిరసనగా AICC నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. TPCC ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. చలో లోక్ భవన్ ముట్టడి కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి పాల్గొన్నప్పటికీ దామోదర రాజనర్సింహ మాత్రం పాల్గొనలేదు. హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనకపోయినా… అందోల్‌లో పార్టీ పరంగా ఎలాంటి నిరసన కార్యక్రమం నిర్వహించలేదు. అధిష్టానం, పీసీసీ ఆదేశాలను పాటించకపోవడం అందోల్ నియోజకవర్గంలో అలవాటుగా మారుతుంది. గత నెలలో నీట్ వివాదంపై రాహుల్ గాంధీ ధర్నాలో పాల్గొనడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి . అప్పుడు సైతం అందోల్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దగా స్పందించలేదు.
పీసీసీ పిలుపు ఇచ్చినా నో రెస్పాన్స్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం కొలువుదీరి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే ఆందోల్ నియోజకవర్గంలో మాత్రం ఏ ఒక్క మండలంలోనూ, చెప్పుకోదగిన స్థాయిలో ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు పోటీపడి ర్యాలీలు, సంబరాలు నిర్వహించి సందడి చేశాయి. కానీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ లో మాత్రం ఎలాంటి సందడి లేదు. అధిష్ఠానం పిలుపునిచ్చినా ముఖ్యమైన కార్యక్రమాలను సైతం తూతు మంత్రంగా నిర్వహిస్తున్నారు. సర్ ప్రక్రియకు సంబంధించి ఇంచార్జి మీనాక్షి నటరాజన్ జోగిపేటకు రావడంతో సర్ కు సంబంధించి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా కార్యకర్తలను భాగస్వాములను చేయడంలో మంత్రితోపాటు కీలక నేతలు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా అందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర పాల్గోనే ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్ప, ఇతర కార్యక్రమాల్లో సందడి లేకుండాపోతోంది. పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించవల్సిన మంత్రి దామోదర రాజనర్సింహ క్యాడర్ కు దిశనిర్ధేశం చేయకపొవడం వల్ల పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వెనుకబడిపోతున్నామనే భావనలో సొంత క్యాడర్ ఉంది.
అయోమయంలో క్యాడర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పుకొవడమే తప్ప.. అందోల్ పార్టీ కార్యక్రమాలను చురగ్గా అమలు చేయడంలో వెనుకబడ్డారు. ఇక మండలాల కమిటీ కుడా నియామకం చేయకపొవడంతో.. పార్టీ కార్యక్రమాల నిర్వహణ భాద్యత తీసుకొవడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడం, కేంద్ర వ్యతిరేక విధానాలను ఎండగట్టడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ కాంగ్రెస్ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతుంటే.. ఆందోల్‌లో మాత్రం ఎలాంటి సందడి లేకుండాపోయిందని సొంత పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు.

