కృష్ణ జైశంకర్ టార్గెట్ 18 మీటర్లు!

కలం, స్పోర్ట్స్ : 15 ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. భారత షాట్‌పుట్ క్రీడాకారిణి కృష్ణ జైశంకర్ (Krishna Jayasankar) ఆసియా గేమ్స్ 2026లో టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం చేయనుంది. జపాన్ వేదికగా జరిగే ఈ పోటీల్లో పాల్గొనడం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పిన కృష్ణ.. కేవలం పాల్గొనడం కోసం కాకుండా పతకం కోసం బరిలోకి దిగుతున్నానని స్పష్టం చేసింది. 23 ఏళ్ల కృష్ణకు ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభంగా జరగలేదు. పలుమార్లు జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో పాటు గాయాలు కూడా ఆమెను వెంటాడాయి. చిన్న వయసులోనే అథ్లెటిక్స్‌లో అవకాశాల కోసం భారత్ నుంచి జమైకా, ఆ తర్వాత అమెరికాకు వెళ్లింది. కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికయ్యే సమయంలో హ్యామ్‌స్ట్రింగ్ గాయం ఎదురైనా.. పట్టుదలతో కోలుకుని తిరిగి పోటీల్లోకి వచ్చింది. అనంతరం ఆసియా గేమ్స్‌కు (Asian Games 2026) అర్హత సాధించడంతో పాటు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది.

2024 పారిస్ ఒలింపిక్స్‌కు దూరం కావడం ఆమె కెరీర్‌లో మరో ఎదురుదెబ్బగా మారింది. వరుస గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న కృష్ణ.. ఆ తర్వాత ఆహారం, నిద్ర, రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఒక్కో అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకుంది. క్రీడా కుటుంబం నుంచి వచ్చిన కృష్ణ తల్లిదండ్రులు ప్రసన్న, జయశంకర్ బాస్కెట్‌బాల్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. అయితే ఆమె అథ్లెటిక్స్‌ను ఎంచుకుని షాట్‌పుట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కుటుంబంతో పాటు రిలయన్స్ ఫౌండేషన్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి లభించిన సహకారం తన ప్రయాణంలో కీలకమని ఆమె పేర్కొంది.

2026 నేషనల్ ఫెడరేషన్ కప్‌లో స్వర్ణం సాధించిన కృష్ణ.. 17.09 మీటర్ల తన అత్యుత్తమ రికార్డును అధిగమించి 17.35 మీటర్ల దూరం విసిరింది. ఇప్పుడు 18 మీటర్ల మార్క్‌ను దాటడమే తన తదుపరి లక్ష్యమని చెబుతోంది. ఆసియా గేమ్స్‌లో పతకంతో పాటు వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. తన రూపంపై వచ్చిన విమర్శలను కూడా కృష్ణ ధైర్యంగా ఎదుర్కొంది. చిన్నప్పటి నుంచే శరీరాకృతిపై కామెంట్లు ఎదురైనా.. కాలక్రమంలో అదే తన బలంగా మారిందని తెలిపింది. యువతులు ఇతరుల ఆమోదం కోసం తమను తాము మార్చుకోవద్దని, తమపై నమ్మకం ఉంచాలని సూచించింది. ఆసియా గేమ్స్‌తో తన ప్రయాణం ముగియదని, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పాల్గొనడమే తన పెద్ద కల అని కృష్ణ పేర్కొంది. 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమ్ ఇండియా జెర్సీ ధరించబోతున్న ఆమెకు జపాన్ వేదికగా కెరీర్‌లో మరో కీలక అధ్యాయం మొదలుకానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>