కలం, వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రం (Bhadradri Kothagudem MCH) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఒక గర్భిణీ పట్ల అక్కడి వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. కనీసం పట్టించుకునే నాథుడు కరువవడంతో, సదరు మహిళ నొప్పులు భరించలేక నిల్చున్న చోటే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో నవజాత శిశువు ఎత్తు నుంచి ఒక్కసారిగా కింద పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి.
బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటికీ వైద్యులు, నర్సులు సకాలంలో స్పందించలేదు. ఆమెను కనీసం లేబర్ వార్డుకు కూడా తీసుకెళ్లకుండా గాలికొదిలేశారు. నొప్పులు తీవ్రం కావడంతో నిలబడిన చోటే ప్రసవం జరిగిపోయింది. బిడ్డ పుట్టి కిందపడిపోయిన తర్వాత కూడా దాదాపు 10 నిమిషాల వరకు ఏ ఒక్క వైద్య సిబ్బంది అక్కడకు రాలేదని బాధితురాలి బంధువులు కన్నీరుమున్నీరవుతూ ఆరోపించారు.
ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈ ఘోర కలిని కళ్లారా చూసిన ఇతర రోగులు, వారి సహాయకులు భయాందోళనలకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతటి నిర్లక్ష్యంపై అక్కడున్న వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. అయితే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిని పోలీసులు ప్రశ్నించగా, వారు ఏమాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడం గమనార్హం. ప్రస్తుతం తీవ్ర గాయాలపాలైన శిశువుకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
Read Also: దశాబ్దాల కలకు టేకాఫ్.. ఉత్తర తెలంగాణకు ఆకాశమే హద్దు!
Follow Us On: Sharechat

