కలం డెస్క్ : Shakib Al Hasan | షకిబ్ అల్ హసన్ తన జీవితంలో మరోసారి బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడంటూ ఆ దేశ క్రీడా సలహాదారు ఆసిఫ్ మహ్మద్ ప్రకటించారు. ఆయన ప్రకటన ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. వీరిమధ్య వివాదానికి షకీబ్ పెట్టిన ఓ పోస్ట్ దగ్గర బీజం పడింది. ప్రస్తుతం పరారీలో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బర్త్‌డే విషెస్ చెప్తూ షకీబ్.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అదే ఇన్ని తంటాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో షకీబ్, ఆసిఫ్ మధ్య చిన్నపాటి మెసేజ్ వార్ నడించింది. ఆ తర్వాత ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆసిఫ్.. షకీబ్ మళ్ళీ జాతీయ జట్టుకు ఎంపిక చేయొద్దని బీసీబీకి సూచిస్తానని వెల్లడించారు. అంతేకాకుండా షకీబ్‌కు అవామీ లీగ్ రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
‘‘షకీబ్‌ను బంగ్లాదేశ్ జెండాను క్యారీ చేయడానికి సమ్మతించలేం. అతడు బంగ్లాదేశ్ జెర్సీ వేసుకోవడానికి కూడా నేను ఒప్పుకోను. ఇప్పటి వరకు నేను బీసీబీకి ఏం చెప్పలేదు. కానీ ఇప్పుడు బీసీబీకి స్పష్టంగా చెప్తున్నా.. బంగ్లాదేశ్ తరుపున షకీబ్ మళ్ళీ జీవితంలో ఆడలేడు. ఎన్నిసార్లు బంగ్లాదేశ్ తరుపున ఆడాలని అడిగినా.. తనకు అవామీ లీగ్.. బలవంతంగా టికెట్ ఇచ్చిందని షకీబ్ చెప్పాడు. కానీ వాస్తవం మాత్రం అతడు పూర్తిగా రాజకీయాల్లో ఉన్నాడు’’ అని ఆసిఫ్ పేర్కొన్నాడు.
అయితే తనకు హసీనా బాగా తెలుసు కాబట్టే బర్త్‌డే విష్ చేశానని షకీబ్ వివరణ ఇచ్చాడు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు హసీనా తెలుసని అన్నాడు. తాను పెట్టిన పోస్ట్ ఎవరినీ ప్రేరేపించేది కాదని అన్నాడు.

