కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్‌పై ఆ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) స్పందించారు. ఆ ఆడియో క్లీప్ నకిలీదని, అందులో ఉంది తన వాయిస్ కాదని పార్టీ క్రమశిక్షణ కమిటీ పంపిన లేఖకు షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని.. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరక ముందే ఆడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. కొందరు కావాలనే తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
అంతేకాదు తాను ఎక్కడా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. మహేశ్ కుమార్ గౌడ్ తనకు 4 దశాబ్దాలుగా తెలుసునని.. అతను తన సోదరుడిలాంటి వాడని వ్యాఖ్యానించారు. మహేశ్ కుమార్ గౌడ్, తనకు మధ్య దూరం పెంచేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. 45 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని, పార్టీకి నష్టం చేకూర్చే పని ప్రాణం పోయినా చేయనని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశంతో కొందరు ఈ తరహా రాజకీయ కుట్రలకు తెరలేపారన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు నమ్మవద్దని, కుట్రదారుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను త్వరలోనే బయటపెడతామని చెప్పుకొచ్చారు.

