Mobile Popup Ad
Mobile Popup Ad

కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా? ఇంట్లోని ఈ పరికరాలే కారణమట!

కలం, వెబ్‌డెస్క్: కొందరి ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువగా ఉన్నప్పటికీ కరెంట్ బిల్లు (Electricity Bill) మాత్రం చాలా ఎక్కువగా వస్తుంటుంది. ఏసీ, మైక్రో వేవ్ వంటి పరికరాలు వాడకపోయినా బిల్లు ఎందుకు ఇంత ఎక్కువగా వస్తోందో అర్థం కాక చాలామంది ఆశ్చర్యపోతుంటారు. అసలు ఏసీ వాడకపోయినా బిల్లు పెరిగిపోవడానికి గల కారణాలు తెలీక చాలా మంది తలపట్టుకుంటారు. అయితే మనం ప్రతిరోజూ వాడే కొన్ని సాధారణ పరికరాలు కూడా ఎక్కువ విద్యుత్ ను వినియోగిస్తాయని మీకు తెలుసా? అవును కొన్ని రకాల పరికరాల గురించి సరైన అవగాహన లేకపోవడంతో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు టెక్నాలజీ నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం.

  1. రిఫ్రిజిరేటర్: ఇప్పుడు అందరి ఇళ్లలో ఉండే సర్వసాధారణ పరికరం. అయితే ఇంట్లో ఫ్రిజ్ రోజుకు ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తూనే ఉంటుంది. ఒకవేళ ఫ్రిజ్ పాత మోడల్ అయితే విద్యుత్ వినియోగం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.
  2. గీజర్: ఎక్కువ కరెంట్ వినియోగించే పరికరాల్లో గీజర్ కూడా ఒకటి అని చెబుతున్నారు నిపుణులు. చాలామంది అవసరం లేకపోయినా ఎక్కువసేపు గీజర్ ఆన్ లో ఉంచుతుంటారు. దీనివల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగి బిల్లు ఎక్కువగా వస్తుంది. అదే విధంగా నీటి మోటార్లు కూడా ఎక్కువసేపు నడిపించడం వలన బిల్లుపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
  3. సెట్ టాప్ బాక్స్, వైఫై రౌటర్, ఛార్జర్లు: టీవీ ఆఫ్ చేసినా సెట్ టాప్ బాక్స్, వైఫై రౌటర్, ఛార్జర్లు వంటి పరికరాలను ప్లగ్ లోనే ఉంచడం కూడా మనం చేసే పొరపాటు అని చెబుతున్నారు నిపుణులు. ఇవి కొద్దికొద్దిగా విద్యుత్ వినియోగిస్తూనే ఉంటాయట. దీనిని స్టాండ్ బై పవర్ అని అంటారు.
  4. పాత పరికరాలు: పాత ఫ్యాన్లు, పాత కూలర్లు, పాత రిఫ్రిజిరేటర్లు కొత్త మోడళ్లతో పోలిస్తే ఎక్కువ విద్యుత్‌ను తీసుకుంటాయని చెబుతున్నారు నిపుణులు.

అందుకే కరెంట్ బిల్లు తగ్గించాలనుకునేవారు ముందుగా ఇంట్లో ఏ పరికరం ఎంతసేపు నడుస్తుందో గమనించడం ముఖ్యమట. అవసరం లేని సమయంలో పరికరాలను పూర్తిగా ఆఫ్ చేయడం వలన కరెంట్ బిల్లును తగ్గించవచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ పరికరాలను ఎంచుకోవడం వలన కూడా విద్యుత్ ఆదా చేయవచ్చని చెబుతున్నారు. ఈ చిన్నపాటి మార్పులు నెలవారీ బిల్లులో స్పష్టమైన తేడా చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>