కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా మునుగోడు పరిధిలో వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చింది. మునుగోడు పరిధిలోని పొలాల్లోంచి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. మునుగోడు-చౌటుప్పల్ ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మర్రివాగు వంతెన ప్రాజెక్టు వద్ద వంతెన పనులు జరుగుతుండటంతో అక్కడ తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు వరద తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో మర్రివాగు వంతెన నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
మరోవైపు పెద్దవాగు చెక్‌డ్యామ్ వరద నీటితో ఉధృతంగా పొంగిపొర్లుతోంది. మర్రివాగు వద్ద రోడ్డుపై వరద నీరు పోటెత్తింది. వరద ప్రభావిత ప్రాంత సమీపంలో ఉన్న ఒక స్క్రాప్ (పాత సామాన్ల) దుకాణంలోకి వరద నీరు చేరింది. దుకాణంలో ఉన్న ఖాళీ బీర్ సీసాలు, ఇతర వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరద ఉధృతి కొనసాగుతుండటంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు మునుగోడు-చౌటుప్పల్ రహదారిపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.

