కలం, కరీంనగర్ బ్యూరో: అనుమతి లేని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను మూసివేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్‌ఎఫ్‌ఐ (SFI) జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ డీఈవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏడి మాధవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ… కరీంనగర్ పట్టణంలో ఇటీవల అనేక పాఠశాలలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రారంభమవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులపై భారీ ఫీజుల భారం మోపుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి, ప్రైవేట్ పాఠశాలల అక్రమ ఫీజు వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన విద్యను ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు. అలాగే, ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న అక్రమ పాఠశాలలను వెంటనే గుర్తించి మూసివేయాలని కోరారు. అనుమతి లేని విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయని పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఒక పాఠశాలకు ఉన్న అనుమతిని ఆధారంగా చేసుకుని అదే రిజిస్ట్రేషన్ పేరుతో వివిధ బ్రాంచీలు ప్రారంభిస్తున్న పరిస్థితి కరీంనగర్‌లో నెలకొన్నందున, అలాంటి బ్రాంచీలను తక్షణమే మూసివేయాలన్నారు. అదే విధంగా “కరికులం”, “ఒలింపియాడ్”, “వరల్డ్”, “ఎక్స్‌ప్లోర్”, “యూనివర్సల్” వంటి తోకపేర్లను నిబంధనలకు విరుద్ధంగా అనేక పాఠశాలలు ఉపయోగిస్తున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్పొరేట్ విద్యను నియంత్రిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రస్తుతం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోందని విమర్శించారు. ఇప్పటికే అనేక అక్రమ విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ అరికట్టాలన్నారు. విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకుని అనుమతులేని పాఠశాలలను పర్యవేక్షించి వెంటనే మూసివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, సహాయ కార్యదర్శి బొగేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు రోహిత్, సందేశ్, సన్నీ, రాకేష్ ,మానస, నాయకులు రోహిత్, మనోజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

