కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ మొహమ్మద్ అమీర్ (Mohammad Amir) త్వరలో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తారా? ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం ఇదే. ఇంతకాలం పాక్ ప్లేయర్లకు ఐపీఎల్‌లోకి నో ఎంట్రీ ఉంది. కానీ దానిని ఇప్పుడు మొహమ్మద్ అమీర్.. బీసీసీఐ పెట్టిన రూల్స్‌లో లూప్ హోల్ వెతికేశాడన్న టాక్ నడుస్తోంది. దీనంతటికి కారణం.. అతడికి యునైటెడ్ కింగ్‌డమ్(UK) పౌరసత్వం, పాస్‌పోర్ట్ లభించడమే. బ్రిటన్ పౌరురాలైన తన భార్య నర్జిస్ ఖాన్ ద్వారా 34 ఏళ్ల అమీర్‌కు ఈ పౌరసత్వం లభించింది. ఈ తాజా పరిణామంతో ఆయన భవిష్యత్తులో ఐపీఎల్ వేలంలో ఒక బ్రిటిష్ ఓవర్సీస్ ప్లేయర్‌గా తన పేరును నమోదు చేసుకోవడానికి అర్హత సాధించారు.
నిజానికి 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ఐపీఎల్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు ఆడకుండా పూర్తిగా నిషేధించారు. అంతకుముందు జరిగిన మొదటి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున పర్పుల్ క్యాప్ గెలిచిన సోహైల్ తన్వీర్, యూనిస్ ఖాన్, కమ్రాన్ అక్మల్‌తో పాటు షోయబ్ అక్తర్ (కేకేఆర్), షాహిద్ అఫ్రిది (డెక్కన్ ఛార్జర్స్), మిస్బా-ఉల్-హక్ (ఆర్‌సీబీ) వంటి ఎందరో పాక్ ఆటగాళ్లు భారత్ వచ్చి సందడి చేశారు. ఆ తర్వాత నుంచి ఏ పాకిస్థాన్ ఆటగాడికీ ఐపీఎల్‌లో అవకాశం దక్కలేదు.
అయితే, బ్రిటన్ పాస్‌పోర్ట్ సాయంతో ఐపీఎల్ ఆడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అజహర్ మహమూద్ కూడా బ్రిటన్ పౌరసత్వం పొందిన తర్వాతే, 2012 మరియు 2013 సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున, అలాగే 2015లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడారు. ఆయన పంజాబ్ తరఫున 22 మ్యాచ్‌లు ఆడి 382 పరుగులు చేయడంతో పాటు 29 వికెట్లు తీశారు. ఇప్పుడు అమీర్ కూడా అదే దారిలో పయనించేందుకు సిద్ధమయ్యారు.

