కలం, కరీంనగర్ బ్యూరో: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ కరీంనగర్ (SFI Karimnagar) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కలెక్టరేట్ లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసులు బలవంతంగా ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ సంక్షోభంలోకి నెట్టివేస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు కళాశాలలకు వెళ్లి తమ సర్టిఫికెట్లు తీసుకోవాలంటే యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొందని అన్నారు. విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం వల్ల విద్యారంగ సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయని, తక్షణమే విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫాంలు అందకపోవడం దారుణమని అన్నారు. ఆగస్టు 15న విద్యార్థులు పాత యూనిఫాంలతోనే పాఠశాలలకు వెళ్లాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతతో పాటు అనేక సమస్యలు ఉన్నాయని, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థులకు ఉదయం టిఫిన్ అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఆ హామీని అమలు చేయలేదని అన్నారు. తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం టిఫిన్ అందించాలని డిమాండ్ చేశారు.
ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పటివరకు ఆచరణలోకి తీసుకురాలేదని విమర్శించారు. వెంటనే జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించాలని కోరారు. కరీంనగర్ పట్టణంలోని సైన్స్ కళాశాలలో సరైన తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.
జిల్లావ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు అవసరమైన విద్యా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంపెళ్ళి అరవింద్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ మానస, రాష్ట్ర కమిటీ సభ్యులు సంజన, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, జిల్లా కమిటీ సభ్యులు సురేష్, రోహిత్ సందేశ్ రాకేష్ సన్నీ మణికంఠ, జాన్సన్, రిషి, ఓంకార్, అభి, అర్ఫన్, నితిన్, నాయకులు సిరివెన్నెల, సాత్విక, హన్సిక ,అమూల్య, తదితరులు పాల్గొన్నారు.

