కలం, ఇంటర్నేషనల్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)కి సీషెల్స్ (Seychelles) దేశం అత్యున్నత గౌరవ పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ ప్రదానం చేసింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులను ఎదుర్కొనే చర్యల్లో ఆయన చూపుతున్న నాయకత్వం, చిన్న ద్వీప దేశాల (స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్) అభివృద్ధికి అందిస్తున్న సహకారానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించింది. విదేశాల నుంచి ప్రధాని మోదీ అందుకున్న 34వ అంతర్జాతీయ పురస్కారం ఇదే. సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ ఈ పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి వ్యక్తి ప్రధాని మోదీ కావడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ఈ అరుదైన గౌరవాన్ని అందించిన సీషెల్స్ ప్రజలకు, ప్రభుత్వం, అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారాన్ని వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రపంచంలోని అన్ని దేశాలకు అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు.
వాతావరణ సవాళ్లను ఎదుర్కోవాలి
‘వాతావరణ మార్పు ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సవాళ్లలో ఒకటి. భావితరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి దేశం బాధ్యత. ఈ సవాలును మనమంతా కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భూమిని మరింత పచ్చగా, సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు భారత్ అవసరమైన ప్రతి చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా మిషన్ లైఫ్, ‘ఏక్ పేడ్ మా కే నామ్’, అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తులను తట్టుకునే మౌలిక వసతుల కూటమి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలను భారత్ అమలు చేస్తోందని వివరించారు.
భారత్ –సీషెల్స్ మధ్య బలమైన భాగస్వామ్యం
సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ మాట్లాడుతూ, తమ దేశ ‘బ్లూ హారిజన్’ పరిరక్షణకు అంకితభావంతో పనిచేసే నాయకత్వాన్ని గౌరవించేందుకు ఈ పురస్కారాన్ని అందిస్తున్నామని చెప్పారు. భారత్–సీషెల్స్ మధ్య బలమైన భాగస్వామ్యానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం సీషెల్స్ చేరుకున్న ప్రధాని మోదీ, అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాగా, ఈ నెల ప్రారంభంలోనే స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ (ఫస్ట్ క్లాస్)’ కూడా ప్రధాని మోదీకి లభించింది.

