Mobile Popup Ad
Mobile Popup Ad

నకిలీ విత్తన మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి: సేవాలాల్ సేన

కలం, ఖమ్మం బ్యూరో: ఏజెన్సీ ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బినామీ ఫెర్టిలైజర్ వ్యాపారాలను అరికట్టడంతో పాటు.. అమాయక రైతులను దోచుకుంటున్న నకిలీ విత్తన మాఫియాపై (Fake Seeds Mafia) కఠిన చర్యలు తీసుకోవాలని సేవాలాల్ సేన (Sevalal Sena) భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. పాల్వంచలో నిర్వహించిన సేవాలాల్ సేన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ శాఖ, టాస్క్ ఫోర్స్ తనిఖీలు కేవలం నామమాత్రంగానే జరుగుతున్నాయని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతరులు స్థానికుల పేర్లతో బినామీ లైసెన్సులు పొంది ఫెర్టిలైజర్ దుకాణాలు నిర్వహిస్తున్నారని, అసలు యజమానులు ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలలో ఉంటూ వ్యాపారాలు సాగిస్తున్నారని తెలిపారు.

మందులు, ఎరువులు, విత్తనాలపై సరైన అవగాహన లేని వ్యక్తులను తక్కువ జీతాలకు నియమించి దుకాణాలు నడిపిస్తుండటంతో, వారు రైతులకు తప్పుడు సలహాలు ఇస్తూ తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక గిరిజన రైతుల అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని ఖాతాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలకే పరిమితం కాకుండా ప్రతిరోజూ మండలాల వారీగా ఆకస్మిక దాడులు నిర్వహించాలని ఆయన కోరారు.

లైసెన్స్ కలిగిన అసలు యజమాని షాపులో ఉన్నాడా, సిబ్బందికి వ్యవసాయ ఇన్‌పుట్లపై సరైన అవగాహన ఉందా అనే అంశాలను పరిశీలించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన (Sevalal Sena) జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: నా సోదరుడు గుర్తొచ్చాడు.. డీజీపీ సీవీ ఆనంద్ భావోద్వేగం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>