Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళలకు ‘స్త్రీనిధి’ కొండంత అండ: సీతక్క

కలం, వెబ్ డెస్క్: మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి బలమైన వేదిక అని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ మహిళలకు స్త్రీనిధి ఒక నమ్మకమైన బ్యాంక్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ అని అన్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక (Annual Action Plan) అమలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్త్రీనిధి ఉద్యోగులంతా కలిసి స్త్రీనిధి స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ను ఏర్పాటు చేసుకోగా, మంత్రి సీతక్క అభినందించారు. సంఘం ఉద్యోగులను ఐక్యం చేయడమే కాకుండా, హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు త‌మ ప్ర‌యోజ‌నాల‌తోపాటు ల‌క్ష‌లాది మ‌హిళ‌ల ఆర్దిక సంక్షేమాన్ని కాపాడాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

మహిళలను ఆదుకోవడానికే స్త్రీనిధి..

రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్దేశించిందని.. స్త్రీనిధి సంస్థ మన ఇల్లు లాంటిదని పేర్కొన్నారు. సంస్థను కాపాడుకుంటేనే ఉద్యోగుల హక్కులు, భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయని చెప్పారు. 2011లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీనిధి, నేటి సీఎం రేవంత్ ప్రభుత్వంలో మరింత బలోపేతం అవుతోందని అన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్న మహిళలను ఆదుకోవడానికే స్త్రీనిధి ఏర్పాటు చేశామని తెలిపారు.

రూ.24 వేల కోట్ల రుణాలు అందించాం..

ఇప్పటివరకు స్త్రీనిధి ద్వారా 32 లక్షల మందికి పైగా మహిళలకు రూ.24 వేల కోట్ల రుణాలు అందించడం గొప్ప విజయమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ స్త్రీనిధి మోడల్‌ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం సీఎం రేవంత్ లక్ష్యమని.. ఆ దిశగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. మహిళల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అనే నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>