కలం, భువనగిరి: యాదాద్రి-భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలోని భువనగిరి-చిట్యాల హైవే (Bhuvanagiri–Chityal Highway) పై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగిరెడ్డిపల్లి సమీపంలో సుమారు 250 మంది లారీ డ్రైవర్లు శనివారం రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నా (Lorry Drivers Protest) కు దిగారు. వారం రోజులుగా తాము ఎదుర్కొంటున్న నరకయాతనపై మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించకపోవడంతో డ్రైవర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆందోళన కారణంగా భువనగిరి-చిట్యాల రహదారికి ఇరువైపులా కిలోమీటరు మేర లారీలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
ఖమ్మం జిల్లా నుండి సుమారు 250 లారీల్లో 8 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంటను లోడ్ చేసుకుని డ్రైవర్లు నాగిరెడ్డిపల్లిలోని మార్కెటింగ్ శాఖకు చెందిన అద్దె గోదాముల వద్దకు చేరుకున్నారు. అయితే, సరుకు దిగుమతి చేసుకోవడానికి తమ వద్ద హమాలీలు లేరంటూ గోదాం యాజమాన్యం లారీలను అన్‌లోడ్ చేయడానికి నిరాకరించింది. దీంతో గత వారం రోజులుగా లారీ డ్రైవర్లు హైవేపైనే లారీలతో సహా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. “వారం రోజులుగా ఇక్కడే రోడ్డుపై మగ్గిపోతున్నాం. తినడానికి సరైన భోజనం లేదు, కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరకడం లేదు. ఎండ తీవ్రతకు లారీల్లోనే నరకం చూస్తున్నాం. మా బాధలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు” అని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత పెద్ద ఎత్తున లారీలు నిలిచిపోయి, డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నా మార్కెటింగ్ అధికార యంత్రాంగం కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదని డ్రైవర్లు, స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, హమాలీల సమస్యను పరిష్కరించి మొక్కజొన్న లోడ్‌ను అన్‌లోడ్ చేయించాలని, తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని లారీ డ్రైవర్లు స్పష్టం చేశారు.

