కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ ఆలోచన మేరకు చిన్నారుల సంరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా పాలన కేంద్రాలను (Child Care Centers) ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, ఆనందమే అసలైన అభివృద్ధి అని పేర్కొన్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గ పరిధిలోని అరుంధతి నగర్‌లో అంగన్వాడీ కేంద్రం-కమ్-పాలన (డే కేర్) కేంద్రాన్ని సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేసి, వారి అభ్యాస ప్రదర్శనలను వీక్షించి అభినందించారు. అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా.. బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్, చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి మాట్లాడారు.
ప్రజల ఇంటి వద్దకే నాణ్యమైన సేవలు..
హైదరాబాద్ నగరంలో తొలి పాలన కేంద్రాన్ని చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని మంత్రి చెప్పారు. ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు సంరక్షణ, పోషకాహారం, ఆటల ద్వారా అభ్యాసం అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ నర్సరీల్లో చేర్పించాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వం ప్రజల ఇంటి వద్దకే నాణ్యమైన సేవలను తీసుకువచ్చిందని అన్నారు. అంగన్వాడీ కేంద్రం, పాలన కేంద్రాన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ద్వారా ఒకే కుటుంబంలోని చిన్నారులందరికీ సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
మొదటి వెయ్యి రోజులు అత్యంత కీలకమైనవి..
అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు చిన్నారులను ఉంచి వారి సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి వివరించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆటవస్తువులు, అభ్యాస సామగ్రి, పోషకాహారం అందుబాటులో ఉంచామన్నారు. చిన్నారి జీవితంలోని మొదటి వెయ్యి రోజులు అత్యంత కీలకమైనవని చెప్పారు. ఆ దశలో మెదడు ఎదుగుదలతో పాటు శారీరక, మానసిక వికాసం జరుగుతుందని తెలిపారు. అందుకే గర్భధారణ దశ నుంచి తొలి రెండేళ్ల వరకు తల్లులు, చిన్నారులకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సేవలు, సంరక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు.
రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..
రాష్ట్రంలో మహిళల సాధికారతకు (Women Empowerment) కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క (Seethakka) పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.61 వేల కోట్లకు పైగా రుణాలు అందించామన్నారు. లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు.
Read Also: ఎల్ నినో కరువు ముప్పు.. తాతలనాటి నేరేడు రహస్యం ఏం చెబుతోంది?
Follow Us On: Instagram

