కలం, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లో రేపటి నుంచి భారీ ట్రాఫిక్ (Secunderabad Traffic) ఆంక్షలు అమలులోకి రానున్నాయి. సికింద్రాబాద్‌లోని రాణిగంజ్ జంక్షన్, ఎంజీ రోడ్డులో రైల్వే అండర్ బ్రిడ్జి ఆధునికీకరణ పనులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రైల్వే శాఖ చేపట్టనున్న ఈ పనులు సుమారు 6 నుంచి 8 నెలల పాటు కొనసాగనున్నాయి. పనుల కారణంగా రోడ్డు తవ్వకాలు చేపట్టి దాదాపు మూడు లేన్ల మేర రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఈ నేపథ్యంలో రాణిగంజ్, ట్యాంక్‌బండ్, కర్బలా మైదాన్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రాణిగంజ్ జంక్షన్ నుంచి ప్యారడైజ్ ఎక్స్‌రోడ్స్ మీదుగా బోయిన్పల్లి వైపు వెళ్లే మార్గంలో ఒక క్యారేజ్‌వేలో కేవలం బైక్‌లు, ఆటోలు, కార్లకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. భారీ వాహనాలు, లారీలు, గూడ్స్ వాహనాలు, ట్రావెల్ బస్సులు, ఆర్టీసీ బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు.
భారీ వాహనాలను ఇతర ప్రాంతాల నుంచి దారి మళ్లించనున్నారు. ఓల్డ్ అంబేడ్కర్ విగ్రహం, కట్ట మైసమ్మ ప్రాంతాల వద్ద కూడా ప్రత్యేక మళ్లింపులు ఉంటాయి. నల్లగుట్ట ఎక్స్‌రోడ్ ట్రాఫిక్‌ను నెక్లెస్ రోడ్ వైపు పంపించనున్నారు. కర్బలా జంక్షన్ వద్ద కార్లు, ఆటోలు, బైక్‌లకు మాత్రం అనుమతి ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతాలపైపు వాహనాల రాకపోకలను వీలైనంత వరకు నివారించాలని పోలీసులు సూచించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

