కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ సమ్మెలో డిమాండ్ (RTC Workers Demands) చేసిన కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఇంకా భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకు వెళదామని చెప్పారు. శనివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు , ఆర్ఎంలు, వివిధ విభాగాల హెచ్ఓడీ , డీఎంలు పాల్గొన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణీకులకు సంబంధించి సానుకూలంగా ఉండాలని సూచించారు. ప్రతి డివిజన్ స్థాయి అధికారులను కోరుతున్న సిబ్బందితో వేధింపులు లేకుండా ప్రేమతో సానుకూల దృక్పధంతో పనులు చేయించాలని చెప్పారు. ఆర్టీసీ అధికారులు కింది స్థాయి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని పట్ల దురుసుగా కాకుండా స్నేహపూర్వకంగా పనులు చేయించుకోవాలని తెలిపారు. డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని చెప్పారు. మే 17 లోపల తమ డిపోల్లో, బస్ స్టేషన్లలో కార్మికులకు మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని సూచించారు. టాయిలెట్స్, మంచి నీటి సౌకర్యం, ప్లాంటేషన్, పరిశుభ్రత పాటించాలన్నారు.
2023 డిసెంబర్ 9 నుండి ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం తీసుకు వచ్చామని మంత్రి వివరించారు. ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ, ఇల్లందు లాంటి కొన్ని డిపోలు నష్టాల్లో ఎందుకు నడుస్తున్నాయో ఆర్ఎంలు, డిపో మేనేజర్ లు సమీక్షించుకోవాలని దిశానిర్దేశం చేశారు. టిక్కెట్ కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు జరిగితే చర్యలు తీసుకోవాలని, సిబ్బంది గొడవలు పెట్టుకోవడం సరికాదని చెప్పారు. సంస్థలో ఇంటర్నల్ ఎటాక్ అనేది ప్రమాదకరమైన విషయమని తెలిపారు. ప్రతి రెండవ మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని.. డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు.
ఆర్టీసీ డిపో మేనేజర్లు గ్రామ సర్పంచ్ నుండి మొదలుకొని ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంచి ప్రజా సంబంధాలు మెయింటేన్ చేయాలన్నారు.ఏదైనా సమస్య తమ స్థాయిలో పరిష్కారం కాకపోతే ఆర్టీసీ ఎండీ స్థాయిలో పరిష్కారం చేద్దామని మంత్రి హామీ ఇచ్చారు. సిబ్బంది పట్ల సానుకూలంగా ఉండాలన్నారు. మంత్రి నుండి సిబ్బంది వరకు అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. పెండింగ్ షాప్ లు ఏవైనా ఉంటే జూన్ వరకు క్లియర్ కావాల్సిందేనని.. ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉన్నాయో చూడాలన్నారు.

