కలం, సెంట్రల్ డెస్క్: సౌదీ అరేబియా (Saudi Arabia) ఆయిల్ దిగ్గజం.. అరామ్కో (Aramco)కు చెందిన అతిపెద్ద డొమెస్టిక్ రిఫైనరీ ఉన్న రాస్ తనూరాపై బుధవారం మరోసారి డ్రోన్ దాడి జరిగింది. ఈ విషయాన్ని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ధృవీకరించారు. రాస్ తనూరా రిఫైనరీని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదు. సోమవారం కూడా ఇరాన్కు చెందిన షాహెద్ ఆత్మహుతి డ్రోన్లతో జరిగిన దాడి కారణంగా రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియాకు చెందిన ప్రధాన చమురు క్షేత్రాలు, మౌలిక సదుపాయాలు ఇరాన్‌కు తూర్పు తీరంలోనే ఉన్నాయి.
తాజా దాడుల నేపథ్యంలో అరామ్కో సంస్థ.. ఎల్పీజీ ఎగుమతులను నిలిపివేసింది. అయితే, స్థానిక సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగలేదు. ప్రొపేన్, బ్యూటేన్ ఎగుమతుల నిలిపివేత మరికొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. కాగా, హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో, సౌదీ తన ఎగుమతులను ఎర్ర సముద్రం మీదుగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నది. హర్మూజ్ జలసంధిని కేవలం చైనా నౌకలకు మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

