కలం, వెబ్ డెస్క్: శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక ఐరిస్ దేనా(IRIS Dena)పై దాడి చేసింది తామేనని అమెరికా ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ డిఫెన్స్ సెక్రెటరీ పీట్ హెగ్సెత్ బుధవారం సాయంత్రం వెల్లడించారు. సబ్మెరైన్ నుంచి టోర్పడోను వదిలి ఇరాన్ వార్షిప్ను ముంచేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ సముద్ర జలాలు కావడంతో బాంబులతో దాడి వంటివి చేయకుండా కేవలం ముంచేసినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా చేయడం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే మొదటిసారని ఆయన తెలిపారు.
తీరానికి మృతదేహాలు : శ్రీలంక
కాగా, ఈ ఉదయం శ్రీలంకలోని గాలె పట్టణానికి 40 నాటికల్ మైళ్ల దూరంలో హిందూ మహాసముద్రంలో వెళుతున్న ఐరిస్ దేనా వార్షిప్ మునిగిపోవడం తెలిసిందే. ఈ ఘటనలో 101 మంది గల్లంతు కాగా, 78 మందిని శ్రీలంక నావికాదళం రక్షించింది. మిగిలినవాళ్ల కోసం సెర్చింగ్ జరుపుతోంది. ఈ క్రమంలో తీరానికి కొన్ని మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు శ్రీలంక ప్రకటించింది.
విశాఖపట్నం నుంచి వెళుతూ..
మరోవైపు మునిగిపోయిన ఇరాన్ నౌక (IRIS Dena) ఇటీవల విశాఖపట్నం వద్ద బంగాళాఖాతంలో నిర్వహించిన మిలాన్ 2026 మల్టీనేషనల్ నేవల్ విన్యాసాల్లో పాల్గొంది. తిరిగి స్వదేశానికి వెళుతుండగా, భారత్–శ్రీలంక మధ్య హిందూ మహాసముద్రంలో ఈ నౌకపై దాడి జరిగింది.

