కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ను(Nitish Kumar) కేంద్ర కేబినెట్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఆయన్ని రాజ్యసభకు పంపనుంది. దీనిపై ఇప్పటికే నితీశ్‌కు సమాచారం అందించారని, ఆయన ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. అలాగే నితీశ్ కేంద్ర రాజకీయాల్లోకి వెళితే బిహార్ పగ్గాలు బీజేపీకి అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, మార్పులు జరగడమే మిగిలి ఉందని ఎన్డీఏ వర్గాలను ఉటంకిస్తూ నేషనల్ మీడియా చెబుతోంది.
కుమారుడి కోసమే?
కాగా, వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అని చెప్పుకునే నితీశ్ కుమార్(Nitish Kumar) తన అభిప్రాయం మార్చుకున్నారు. తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఇటీవల ఓ సమావేశంలో వెల్లడించారు. అంతకుముందు, జేడీయూకు చెందిన పలువరు సీనియర్ నేతలు ఇదే విషయాన్ని తెలిపారు. నిశాంత్‌ను రాజ్యసభకు పంపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. అయితే, అనూహ్యంగా ఇప్పుడు నితీశ్ కుమార్‌ను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారనే వార్తల నేపథ్యంలో.. ఆయనతోపాటు ప్రశాంత్‌ను కూడా రాజ్యసభకు పంపుతారా? లేకపోతే జేడీయూ పగ్గాలు అప్పగించి రాష్ట్ర రాజకీయాల్లో తీర్చిదిద్దుతారా? అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

