పతకం గెలిచినా పట్టించుకోరా? బ్యాడ్మింటన్ స్టార్ల పోస్ట్ వైరల్

కలం, వెబ్ డెస్క్: ప్రతిష్ఠాత్మక థామస్ కప్‌(Thomas Cup)లో కాంస్య పతకంతో మెరిసిన భారత బ్యాడ్మింటన్ జట్టుకు స్వదేశంలో చేదు అనుభవం ఎదురైంది. టోర్నీ ముగించుకుని తిరిగి వచ్చిన తమను ఎవరూ పట్టించుకోకపోవడంపై స్టార్ డబుల్స్ జోడి సాత్విక్‌సాయిరాజ్ – చిరాగ్ శెట్టి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత రెండు వారాలుగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదని, అసలు ఎవరికీ పట్టింపు లేనట్టుగా ఉందని వారు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మరోవైపు జట్టు సీనియర్ ఆటగాడు హెచ్.ఎస్. ప్రణయ్ ఈ పతకంపై భిన్నంగా స్పందించారు. ఈ విజయం తన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పారు. కేవలం మెడల్ మాత్రమే కాకుండా, జట్టులో ఉన్న శక్తి, ఒకరిపై ఒకరు ఉంచుకున్న నమ్మకం మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది థామస్ కప్‌లో (Thomas Cup) భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ సెమీఫైనల్‌లో ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైంది. గాయం కారణంగా కీలక ఆటగాడు లక్ష్య సేన్ దూరం కావడంతో భారత జట్టుపై ఆ ప్రభావం పడింది. మొదటి సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి, రెండో సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ పోరాడినా ఫలితం దక్కలేదు. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ కూడా ఓడిపోవడంతో భారత్ 0-3తో వెనుకంజ వేసింది. సెమీస్ చేరడం ద్వారా భారత్‌కు కాంస్యం ఖాయమైంది.

2022లో చారిత్రాత్మక టైటిల్ గెలిచిన భారత్, థామస్ కప్ చరిత్రలో సెమీఫైనల్ చేరడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతటి ఘనత సాధించినా, జట్టు వెళ్లేటప్పుడు కానీ, తిరిగి వచ్చేటప్పుడు కానీ ఎలాంటి హడావుడి లేకపోవడం ఆటగాళ్లను కలచివేసింది. ఈ అంశంపై సాత్విక్-చిరాగ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Read Also: నేను రాజీనామా చేయను: మమతా బెనర్జీ సంచలన ప్రకటన

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>