ప్రభుత్వ హెలికాప్టర్‌లో ఎమ్మెల్యే భర్త సవారీ.. విపక్షాల ఫైర్!

​కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా సత్తుపల్లి రాజకీయాల్లో ఒక ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా, కనీసం వార్డ్ సభ్యుడిగా కూడా గెలవని సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి భర్త మట్టా దయానంద్ (Matta Dayanand) .. ప్రభుత్వ హెలికాప్టర్‌లో పర్యటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

​సత్తుపల్లి సమీపంలోని బేతుపల్లి చెరువు వద్ద ఇటీవల జరిగిన ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారులను, వారిని రక్షించేందుకు వెళ్లి చిక్కుకుపోయిన ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) సిబ్బందిని అభినందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్లారు. ఈ అధికారిక కార్యక్రమం కోసం హైదరాబాద్ నుండి సత్తుపల్లికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ హెలికాప్టర్‌లో ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్ ప్రయాణించారు.

​”హెలికాప్టర్‌లో వచ్చిన టైగర్” అంటూ రీల్స్ హడావిడి..

ప్రభుత్వ వనరులను ఇష్టానుసారంగా వాడుకోవడమే కాకుండా, హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తీసిన వీడియోను “హెలికాప్టర్‌లో వచ్చిన టైగర్” అంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేసి పోస్ట్ చేయడం మరింత ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వ హెలికాప్టర్‌ను షేర్ ఆటోలా వాడుకుంటూ ఇలా సోషల్ మీడియాలో హడావిడి చేయడంపై నెటిజన్లు, విపక్షాలు మండిపడుతున్నాయి.

​ఖజానాలో డబ్బుల్లేవ్‌.. మరి ఈ విలాసాలా?

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, ఖజానాలో సంక్షేమ పథకాలకు నిధులు లేవని ప్రభుత్వం పదే పదే చెబుతున్న తరుణంలో.. ఎలాంటి రాజ్యాంగబద్ధ హోదా లేని వ్యక్తులు ప్రభుత్వ ఖర్చులతో హెలికాప్టర్లలో విహరించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తూ, సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేసుకుంటున్న కాంగ్రెస్ నేతల తీరుపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>