కలం, స్పోర్ట్స్ : గాయపడిన భారత ఆటగాళ్లు పునరావాసం కోసం ‘ప్రైవేట్ ట్రైనర్లను’ వాడుతున్నారనే వార్తలను బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (సీఓఈ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఖండించారు. బెంగళూరులో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ప్రచారంపై ఆయన తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రికెటర్లు ప్రైవేట్ ట్రైనర్ల సహాయం తీసుకుంటున్నారనే ఆరోపణలు తన దృష్టికి రాలేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
ఒప్పందం ఉన్న ప్రతి ఆటగాడి పునరావాస పురోగతిని జాతీయ జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ (S&C) బృందం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఆటగాళ్లు ఎక్కడ, ఏం శిక్షణ తీసుకుంటున్నా ఆ వివరాలన్నీ జీపీఎస్ ద్వారా ఏఎంఎస్ సిస్టమ్‌లో పక్కాగా నమోదవుతాయని వెల్లడించారు. బీసీసీఐ ఎస్‌అండ్‌సీ బృందం పనితీరుపై లక్ష్మణ్ పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ఏడ్రియన్, నిక్ లాంటి ప్రపంచ స్థాయి నిపుణులు తమతో ఉన్నారని చెప్పారు.
ఆటగాళ్లకు, ట్రైనర్లకు మధ్య స్పష్టమైన అవగాహన, సమన్వయం ఉన్నాయని తెలిపారు. ఆటగాళ్లను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు పక్కా వ్యవస్థ ఉందన్నారు. గాయాన్ని గుర్తించిన తర్వాత ముంబైకి చెందిన డాక్టర్ దిన్షా పర్డీవాలాతో పాటు ఇంగ్లాండ్, జర్మనీ, సౌతాఫ్రికా వైద్యుల సలహాలు తీసుకుంటామన్నారు. క్లినికల్, ఫిజికల్, స్కిల్ శిక్షణల అనంతరం రెండు ‘రిటర్న్ టు ప్లే’ (RTP) మ్యాచ్‌లు ఆడిస్తామని చెప్పారు. నిర్దేశిత బెంచ్ మార్క్ సాధించిన తర్వాతే క్రీడాకారులకు ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

