కలం మెదక్ జిల్లా బ్యూరో: ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి పుట్టెడు బాధలో ఉన్న కుటుంబానికి నష్టపరిహారంగా అందించిన సొమ్మును సాక్షాత్తూ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారే నొక్కేసిన ఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 2025 నవంబర్ 18న సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడంటూ మృతుడి బంధువులు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి రూ.25 లక్షలు ఇచ్చేలా అంగీకారం కుదిర్చారు. దీంతో ఆసుపత్రి నిర్వాహకులు మృతుడి కుటుంబానికి రూ.15 లక్షలు , డీహెచ్ఎంవో వసంత్ రావుకు రూ.10 లక్షలు అప్పగించారు. గత కొన్ని నెలలుగా మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు రూ.10 లక్షల కోసం డీహెచ్ఎంవో వసంతరావును అడుగుతున్నా.. రేపు, ఎల్లుండి ఇస్తానంటూ దాటవేస్తూ వస్తున్నాడు. శనివారం ఆయన బదిలీ అయిన విషయం తెలుసుకున్న వెంకటేశ్ కుటుంబసభ్యులు మరోసారి గట్టిగా నిలదీశారు. విషయం కాస్తా బయటకు పొక్కడంతో అప్పటికప్పుడు 5 లక్షలు ఇచ్చి, మిగతా రూ.5 లక్షలు ఈ నెల 10వ తేదీలోగా ఇస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు. డీహెచ్ఎంవో బాధితుల డబ్బులు వాడుకున్న విషయం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

