Mobile Popup Ad
Mobile Popup Ad

ఫిర్యాదుదారుల కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి : డీజీపీ సీవీ ఆనంద్

కలం, తెలంగాణ బ్యూరో : ఫిర్యాదుదారుల కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) తెలిపారు. పోలీస్ శాఖలో అవినీతి వంటి ప్రతికూల ధోరణులకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. శనివారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షించడంతో పాటు ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖలో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మారుతున్న సామాజిక పరిస్థితులు, కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీస్ శాఖ ప్రస్తుత పనితీరులో మార్పు రావాలని ప్రభుత్వం ఆశిస్తోందని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, పై అధికారుల పట్ల గౌరవం లేకపోవడం, అవినీతి వంటి ప్రతికూల ధోరణులకు అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. పోలీసు సేవలందింపులో గణనీయమైన మార్పు తీసుకురావాలన్నారు. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ కఠిన క్రమశిక్షణ పాటించాలన్నారు.

గడిచిన మూడు దశాబ్దాలుగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ప్రధానంగా మావోయిజం, నక్సలిజం అణచివేతపైనే దృష్టి సారించిందని డీజీపీ గుర్తుచేశారు. గత 15 ఏళ్లుగా నక్సల్స్ ప్రభావం దాదాపుగా తగ్గిపోయినందున.. ప్రస్తుత పోలీసింగ్ అవసరాలకు అనుగుణంగా గ్రేహౌండ్స్, ఎస్ఐబి వంటి ప్రత్యేక విభాగాల ప్రాధాన్యతను పునఃసమీక్షించి, వాటిని పునర్వ్యవస్థీకరించే సమయం వచ్చిందన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తుపదార్థాల (నార్కోటిక్స్) నిర్మూలనకు అధికారులు గట్టిగా కృషి చేయాలని, ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు చర్యలు తీవ్రతరం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రతా ప్రమాణాలను క్రమబద్ధీకరించడానికి త్వరలోనే ‘ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో’ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రజారోగ్య రక్షణ కోసం ఆహార కల్తీ నిరోధక విభాగాన్ని (ఫుడ్ అడల్టరేషన్ వింగ్), ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూసేందుకు ‘విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్’ విభాగంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

మహిళల భద్రత, బాలల అక్రమ రవాణా నిరోధానికి పెద్దపీట వేయాలని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని డీజీపీ స్పష్టం చేశారు. భరోసా కేంద్రాలు, షీ టీమ్స్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లలో సీసీటీఎన్ఎస్ (CCTNS 2.0) సాఫ్ట్‌వేర్, ఇతర సాంకేతిక పరిజ్ఞానాల అమలు సరిగా లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతిక వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించేందుకు సీఐడీ డీజీ, టెక్నికల్ సర్వీసెస్ డీజీల పర్యవేక్షణలో యువ ఐపీఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక ‘డీజీపీ టెక్ టీమ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డేటా విశ్లేషణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ‘హాక్ ఐ ఆల్ట్రా’, ‘టీజీ-కాప్ ఆల్ట్రా’ వంటి అధునాతన అప్లికేషన్లను ప్రవేశపెడతామన్నారు. పోలీస్ శాఖలో అంతర్గత క్రమశిక్షణ అత్యంత కీలకమని, కింది స్థాయి అధికారులు ఎల్లప్పుడూ పై అధికారులకు తగిన గౌరవం ఇస్తూ, తోటి సిబ్బందితో సమన్వయం కలిగి ఉండాలని సూచించారు. అధికారులు కేవలం పర్యవేక్షకులుగా కాకుండా నిజమైన నాయకులుగా పనిచేయాలన్నారు. శాంతిభద్రతలను కాపాడేటప్పుడు అత్యున్నత నైతిక విలువలు పాటించాలని, ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాలని స్పష్టం చేశారు.

అన్ని జిల్లాల సీపీలు, ఎస్పీలు ప్రతి నెలా 15వ తేదీ లోపు క్రైమ్ రివ్యూ (నేరాల సమీక్ష) సమావేశాలు నిర్వహించాలని, ఆ నివేదికలను అదే నెల 20వ తేదీ లోపు డీజీపీ కార్యాలయానికి, సీఐడీకి పంపాలని ఆదేశించారు. జిల్లాల్లో అధికారుల పనితీరును నిరంతరం పర్యవేక్షించి, మార్గదర్శకత్వం చేయడానికి నలుగురు ప్రత్యేక డీఐజీలను నియమించాలని యోచిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి యూనిట్ అధికారి నెలకు కనీసం రెండు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఆ వివరాలను స్వహస్తాలతో రికార్డు చేయాలని స్పష్టం చేశారు. వార్షిక తనిఖీలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలన్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా.. ప్రతి పోలీస్ యూనిట్ ప్రతిరోజూ మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు బాధితుల కోసం సమయాన్ని కేటాయించడం తప్పనిసరి అని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డీజీపీ హామీ ఇచ్చారు.

వివిధ ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 6,000 కోట్ల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, ఇతర బకాయిలపై ఇటీవలే ముఖ్యమంత్రితో జరిపిన సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.2,000 కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన రూ. 4,000 కోట్లను త్వరలో విడతల వారీగా విడుదల చేస్తారని వెల్లడించారు. పెండింగ్ బకాయిలపై సిబ్బంది ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే అన్ని ప్రయోజనాలు అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో డీజీలు మహేష్ ఎం. భగవత్, వి.వి. శ్రీనివాసరావు, చారు సిన్హాలు ఆయా విభాగాల పనితీరును వివరించారు. ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ నాయుడు, గజరావ్ భూపాల్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్ఓలు), ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>