కలం, మెదక్ బ్యూరో: ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో బీజేపీ(BJP) పార్టీకి వచ్చిన ఫలితాలు సొంత కార్యకర్తలను సైతం షాక్ కు గురిచేశాయి. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో మొత్తం 256 వార్డులు ఉండగా కేవలం 16 వార్డుల్లో మాత్రమే బీజేపీ అభ్యర్ధులు గెలవడంతో క్యాడర్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్వతంత్రులు 18 చోట్ల గెలిచి బీజేపీ (BJP) పార్టీ కంటే ముందున్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నా.. వారికి మార్గనిర్దేశం చేసేవారు లేక బీజేపీ ఫలితాల్లో వెనుకబడింది.
సంగారెడ్డి జిల్లా బిజెపీ అధ్యక్షురాలుగా గోదావరి అంజిరెడ్డి (Godavari Anji Reddy) ఉన్నారు. ఆమె భర్త అంజిరెడ్డి గ్రాడ్యూయోట్ ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఫలితాలు మాత్రం సరిగా రాలేదు. జిల్లాప్రెసిడెంట్ గోదావరి అంజిరెడ్డి సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో పాటు, అజెండా లేకుండా ఎన్నికలకు వెళ్లడంతో ఓటర్లు బీజేపీ(BJP) పార్టీని ఘెరంగా తిరస్కరించారు. అభ్యర్దుల ఎంపిక సరిగా జరగకపోవడంతో పాటు, గ్రామస్ధాయి కార్యకర్తలను ప్రచారంలోకి దింపి, మున్పిపాలిటికి సంబంధించిన నాయకులతో సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు.
బీజేపీ(BJP) అనుబంధ యువజన విద్యార్ధి, కార్మిక, రైతు సంఘాల వారిని ప్రచారంలో భాగస్వాములను చేయలేదు. దీంతో బీజేపీ పార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం క్షేత్రస్ధాయిలో పనిచేసేవారే కరువయ్యారు. సంగారెడ్డి(Sangareddy) జిల్లాకు బీజేపీ రాష్ట్ర స్ధాయి నేతలు ప్రచారానికి రప్పించడంలో గోదావరి అంజిరెడ్డి విఫలం చెందారు. పెద్దనేతలు ప్రచారం చేసి ఉంటే అభ్యర్ధుల్లో విశ్వాసం పెరిగి , కార్యకర్తల్లో కుడా జోష్ వచ్చేది. అభ్యర్ధులను, పార్టీని సమన్వయం చేస్తూ ముందుండి ప్రచారం నిర్వహించవల్సిన జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలను పట్టించుకోకపోవడంతో బీజేపీ గ్రాఫ్ బాగా పడిపోయిందని సొంత కార్యకర్తలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


