కలం, సిటీ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజిస్తూ (GHMC Division) రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు (High Court) ఆదేశించింది. మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. GHMC విభజనను సవాలు చేస్తూ దారం గురవారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన సందర్భంగా పై ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సైతం మూడు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో రెవెన్యూ సరిహద్దుల్ని ఫ్రీజ్ చేస్తూ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం దానికి విరుద్దంగా జీహెచ్ఎంసీ సరిహద్దుల్ని మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది గుమ్మి రాజ్‌కుమార్ వాదించారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఫ్రీజింగ్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినా తెలంగాణ ప్రభుత్వం GHMC ని విభజిస్తూ ఉత్తర్వులు ఎలా ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఈ విభజన ప్రక్రియపై వెంటనే స్టే విధించాలని హైకోర్టును కోరారు. సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ గతేడాది ఆగస్టులోనే గెజిట్ నోటిఫికేషన్ జారీచేసి గ్రామాల, మండలాల, జిల్లాల సరిహద్దులను మార్చే ప్రక్రియను డిసెంబరు 31వ తేదీలోగా పూర్తి చేయాలని, ఆ తర్వాతి రోజు నుంచి సాధ్యం కాదని స్పష్టంగా డెడ్‌లైన్ విధించిన అంశాన్ని గుర్తుచేశారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా రెవెన్యూ సరిహద్దులను మార్చకుండా నిషేధపు ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని, అయినా దానికి విరుద్ధంగా ఆ గెజిట్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.
Read Also: ఆర్టీసీని ‘మేఘా’కు ధారాదత్తం చేసే కుట్ర : కవిత
Follow Us On : WhatsApp


