స‌త్తుప‌ల్లి స‌ర్కార్‌ ఆస్ప‌త్రి తీరుపై సండ్ర ఆగ్రహం!

కలం, సత్తుపల్లి: సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (Sandra Venkata Veeraiah) కోరారు. ఆదివారం 100 పడకల ఆసుపత్రి భవనాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలకు ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదన్నారు. సత్తుపల్లి 100 పడకల ఆసుపత్రిలో ఆధునిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు గతంలోనూ నివేదికలు వెలువడ్డాయ‌న్నారు. కొంతమంది వైద్యులు సమయానికి విధులకు హాజరు కావడం లేదని, మరికొందరు ముందుగానే విధుల నుంచి వెళ్లిపోతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని సండ్ర తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు దృష్టి సారించాలని కోరారు.ఆసుపత్రిలో మంచినీటి సమస్యతో పాటు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహణలో జాప్యం జరుగుతోందనే ఫిర్యాదులు కూడా ఉన్నాయని తెలిపారు. కొన్ని ధ్రువపత్రాల కోసం డబ్బులు అడుగుతున్నారనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని కోరారు.ఇటీవల రేజర్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పాము కాటు వేయగా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో యాంటీ స్నేక్ వీనం అందడంలో జాప్యం జరిగిందనే ఆరోపణలు వచ్చాయని సండ్ర పేర్కొన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన మందులు, యాంటీడోట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించే పేదలు, సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం వైద్యులు, సిబ్బంది బాధ్యత అని సండ్ర అన్నారు. వైద్యులు విధులకు సక్రమంగా హాజరై రోగులకు అందుబాటులో ఉండాలని కోరారు. ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సండ్ర డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>