కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. చింతకాని ఎస్సై నరేష్ వివరాల ప్రకారం.. ఖమ్మం – బోనకల్ ప్రధాన రహదారిపై రామకృష్ణాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడిని కామేపల్లి మండలం ముచ్చెర్ల గ్రామానికి చెందిన జాని(32)గా గుర్తించారు. బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బస్సు ఢీకొట్టడంతో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన ‘లహరి’ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

