కలం, వెబ్ డెస్క్: నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో పూడ్చిన శవాన్ని గ్రామ పెద్దలు బయటకు తీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన పదర మండలం కోడోనిపల్లి (Kodonipalli) గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి మూడు నెలల క్రితం హైదరాబాద్లో ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అదే రోజు హైదరాబాద్లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇక తాజాగా కోడోనిపల్లి గ్రామ పెద్దలు ఆంజనేయులు అంత్యక్రియలు సరిగా జరగకపోవడం వల్లనే తమ గ్రామంలో వర్షాలు పడటం లేదని భావించారు. పోస్ట్ మార్టం అనంతరం ఆంజనేయులు దుస్తులు, మొలతాడు తీయకుండా అలాగే ఖననం చేశారని, అలా చేయడం వల్లనే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని గ్రామస్తులకు చెప్పారు. దాదాపు మూడు నెలల తర్వాత నేడు ఆంజనేయులు శవాన్ని బయటకు తీసి కట్టెలపై పెట్టి పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పలువురు స్థానికులు ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మే వారు ఉంటారా ? అని నెటిజన్లు షాకవుతున్నారు.

