కలం, సినిమా: ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు (Rapthadu)లో ఇటీవల ఓ విద్యార్థినిని హేమంత్ అనే ఉన్మాది అత్యంత కిరాతకండా రంపంతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. ఆ విద్యార్థిని ఇప్పుడు బెంగళూరులో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు చాలామంది నెటిజన్లు పలువురు డైరెక్టర్లపై విరుచుకుపడ్డారు. సినిమాల్లో నేరాలు, ఘోరాలను విచ్చలవిడిగా చూపిస్తున్నారని, అవి చూసి చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారని కామెంట్ చేశారు. ఈ సందర్భంగా కొందరు డైరెక్టర్ల పేర్లు, వారి సినిమాలు ప్రస్తావించి మరీ విమర్శించారు. ఈ ఘటనకు ఆ దర్శకులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ లిస్ట్‌లో యానిమల్, అర్జున్ రెడ్డి సినిమాల దర్శకులు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఈ విమర్శలపై స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు.
ఎవరైనా పెద్ద నేరానికి పాల్పడినప్పుడు బాధితులపై సానుభూతి చూపించాలని సందీప్ రెడ్డి వంగా అన్నారు. అసలు సమస్య ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. అంతే కానీ సులభంగా సినిమాలను బలిపశువును చేయడం కాదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధితుల పట్ల లేదా వారి కుటుంబాల పట్ల ఎలాంటి ఆందోళన లేని కొందరు ఈ భయానక విషాదాన్ని తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఒక సాకుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.
ఈ విమర్శలు ప్రధానంగా ఫెల్యూర్ క్యాండిడేట్స్, నిరుద్యోగులు మాత్రమే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కొందరు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతరుల పనిపై బురదజల్లే అవకాశం దొరికినప్పుడల్లా తామేదో సంఘ సంస్కర్తలలా బిల్డప్ ఇస్తారని విమర్శించారు. ఏ విషాదమైనా సానుభూతిని కోరుకుంటుంది కానీ, ఇలాంటి అవకాశవాదాన్ని కాదని, రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. ఇక వంగా పెట్టిన ఈ పోస్టు కూడా నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఘటన జరిగినప్పుడు వంగా (Sandeep Reddy Vanga) రెస్పాండ్ కాలేదు కానీ, తనపై విమర్శలు వచ్చినందుకు స్పందించాడంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read : రాష్ట్ర చరిత్రలోనే రేవంత్ చెత్త సీఎం: హరీశ్ రావు
Follow Us On: Youtube

