జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేటకు మహర్దశ!

కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ (Professor Jayashankar) స్వగ్రామం అక్కంపేట (Akkampet) అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో గ్రామాన్ని ఆదర్శ మోడల్‌ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి అక్కంపేటలో విస్తృతంగా పర్యటించి ప్రతిపాదిత అభివృద్ధి పనులను పరిశీలించారు.

స్థానిక సర్పంచ్‌ సాంబయ్య, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎస్సీ కాలనీ, యాదవ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతిపాదిత సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించి, ఆయా శాఖల అధికారులు అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరగా సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచడంతో పాటు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోదండ రామాలయం, రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీబీజీ రాంజీ ద్వారా నిర్మిస్తున్న కమ్యూనిటీ శానిటేషన్‌ కాంప్లెక్స్‌ పనులను ప్రారంభించారు.

అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, పీఎంశ్రీ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల వివరాలు, మాక్‌ టెస్టుల నిర్వహణపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని, తమ ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా కెరీర్‌ను ఎంచుకోవాలని సూచించారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. అక్కంపేటకు ఉన్న చారిత్రక గుర్తింపును విద్యార్థులు నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రాంగణంలో కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసి వివిధ రకాల కూరగాయలు పండించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈవో విజయ్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>