కలం, జోగులాంబ గద్వాల: అర్హులైన పట్టభద్రులందరినీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా నమోదు (Graduate Voter Registration ) చేయించేందుకు బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో బాధ్యతగా కృషి చేయాలని బీజేపీ జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ధ రెడ్డి (DK Snigdha Reddy) పిలుపునిచ్చారు. బుధవారం ధరూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తిమ్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పట్టభద్రుల ఓటరు నమోదుపై విస్తృతంగా అవగాహన కల్పించి, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలి అని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ప్రతి పట్టభద్రుడిని కలిసి ఓటరు నమోదు ప్రాముఖ్యతను వివరించాలని కోరారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యతను పార్టీ శ్రేణులు తీసుకోవాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, సర్పంచ్ రాజేష్ అయ్యా, మండల ఎమ్మెల్సీ ఇన్చార్జ్ నర్సన్ దొడ్డి కృష్ణా రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు రామి రెడ్డి, శేఖర్ రెడ్డి, కేటీదొడ్డి మండల అధ్యక్షుడు శ్రీపాద రెడ్డి, కౌన్సిలర్ చంద్రశేఖర్, శాలన్న, ధరూర్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

