బొల్లేప‌ల్లి పీహెచ్‌సీని సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ అనురాగ్

కలం, యాదగిరిగుట్ట: స‌ర్కార్ ఆస్ప‌త్రుల్లో అన్ని మౌలిక వ‌స‌తులు ఉన్నా సాధార‌ణ ప్ర‌స‌వాల సంఖ్య ఎందుకు త‌గ్గుతోంద‌ని క‌లెక్ట‌ర్ అనురాగ్ జ‌యంతి (Anuraag Jayanti) డాక్ట‌ర్లు, వైద్య సిబ్బందిని ప్ర‌శ్నించారు. భువనగిరి మండలం బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (Bollepally PHC) కలెక్టర్ బుధ‌వారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సాధారణ ప్రసవాల అంశాన్ని ఆయ‌న‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలకు అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రసవాలు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణులకు అవసరమైన వైద్య పరీక్షలు, నిరంతర పర్యవేక్షణ అందిస్తూ సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనే సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రోగుల సంఖ్య పెరగడమే కాదు.. వారికి అందుతున్న వైద్య సేవల నాణ్యత కూడా ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఓపీకి వచ్చే ప్రతి రోగి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, అభా రిజిస్ట్రేషన్లు నిర్వహించడం తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. ఆసుపత్రి సేవల్లో పారదర్శకత, రోగుల వివరాల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. హిమోగ్లోబిన్ స్థాయులు, వైద్య పరీక్షలు, మందుల వినియోగం తదితర అంశాలను వారినే నేరుగా అడిగి తెలుసుకున్నారు. పోషకాహార లోపం లేకుండా ఐరన్‌తో పాటు అవసరమైన పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని సూచించారు. చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు అందుతున్నాయా అని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ఒక ఎత్తయితే.. వాటిని ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలుగా అందించడం మరో ఎత్తు అని, సాధారణ ప్రసవాల పెంపు, గర్భిణుల ఆరోగ్య పరిరక్షణలో క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>