సైబర్ నేరాలపై అప్రమత్తతే అసలైన రక్షణ: ఎస్పీ శ్రీనివాసరావు

కలం, జోగులాంబ గద్వాల: సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కొత్త రూపాల్లో పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు సూచించారు. సైబర్ నేరాల నివారణలో భాగంగా ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే ‘సైబర్ జాగృక్తా దివస్’ (Cyber Jaagrukta Diwas) లో భాగంగా బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ కె. శంకర్‌తో కలిసి అవగాహన పోస్టర్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలియని లింకులు, నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ యాప్‌లు, ఆకర్షణీయమైన ఆఫర్లు, మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంకు అధికారులు, యూపీఐ ప్రతినిధులమని చెప్పి ఫోన్ చేసినా వెంటనే నమ్మవద్దని, ఓటీపీ, పిన్‌, పాస్‌వర్డ్‌, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.

ఆన్‌లైన్ షాపింగ్‌ సమయంలో వెబ్‌సైట్ చిరునామాను పరిశీలించిన తర్వాతే కొనుగోళ్లు చేయాలని, పబ్లిక్ వై-ఫై ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించవద్దని సూచించారు. అవసరం లేని యాప్‌లకు కెమెరా, మైక్రోఫోన్‌, కాంటాక్ట్స్ అనుమతులు ఇవ్వకూడదన్నారు. యూపీఐ ద్వారా డబ్బు స్వీకరించడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌ ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చని తెలిపారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>