కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాదాబైనమా, భూభారతి దరఖాస్తులకు మోక్షం కలగనుంది. అందుకనుగుణంగా జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం తహసీల్దార్లు,సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం సడలించిన నిబంధనల ఆధారంగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సంబంధిత దరఖాస్తులపై వెంటనే నోటీసులు జారీ చేసి, వేగవంతమైన చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని తాహసీల్దారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను తాహసీల్దారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా అన్ని భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న పాల్వంచ, దమ్మపేట, కరకగూడెం తదితర మండలాల్లో ఉన్న అటవీ, రెవెన్యూ, ఇతర భూ సమస్యలకు సంబంధించిన సమగ్ర నివేదికలను వెంటనే సిద్ధం చేసి రేపటిలోగా సమర్పించాలని తాహసీల్దారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

