Mobile Popup Ad
Mobile Popup Ad

హిందువులు జాగృతం కాకపోతే బానిసత్వమే : మోహన్ భగవత్

కలం, నిజామాబాద్ బ్యూరో : హిందువులు చైతన్యం కావాలనే ఉద్దేశ్యంతోనే హెడ్గే వార్ ఆర్‌ఎస్‌ఎస్ ను స్థాపించారని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) చెప్పారు. హిందువులు జాగృతం కాకపోతే బానిసత్వం తప్పదని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి లో కేశవ స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భగవత్ ప్రారంభించారు. అనంతరం మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సందర్శకుల బుక్ లో సందేశాన్ని రాశారు. అనంతరం మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) మాట్లాడుతూ.. హెడ్గేవార్ జననం, మరణం నాగ్ పూర్ లోనే జరిగిందన్నారు. అయితే ఆయన పూర్వీకులు కందకుర్తికి చెందిన వారని, దీంతో ఇక్కడ స్ఫూర్తి కేంద్రం నిర్మించాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు. కందకుర్తి ప్రాశస్త్యం తనకు ఈ రోజే తెలిసిందన్నారు. భారతమాతను దాస్య శృంఖాలల నుంచి విడిపించడానికి హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ను ఏర్పాటు చేశారని వివరించారు.

బ్రిటిష్ వాళ్లకంటే ముందు ఎంతో మంది విదేశీయులు భారత్ ను పాలించారని తెలిపారు. భవిష్యత్ లో హిందూ సమాజం జాగృతం కాకపోతే బానిసత్వం తప్పదని ఆయన భావించారని చెప్పారు. హిందువుల్లో చైతన్యం కోసం ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని మోహన్ భగవత్ వెల్లడించారు. అందుకోసమే కందకుర్తి నుంచే హిందూ సమాజాన్ని ఆదర్శంగా మార్చడానికి హెడ్గేవార్ సంస్థను ఏర్పాటు చేశారన్నారు. నేడు ఆయన చూపిన మార్గంలో ఎంతో మంది నడుస్తున్నారని చెప్పారు. హెడ్గేవార్‌కు కందకుర్తి నుంచి సేవా భావం, దేశ భక్తి వచ్చాయని పేర్కొన్నారు. కందకుర్తిలోని మట్టిలో సైతం హెడ్గేవార్ స్ఫూర్తి ఉందన్నారు. ఆయన చూపిన మార్గంలో స్ఫూర్తి మందిరం ఏర్పాటు చేసుకున్నామని, భవిష్యత్లో హెడ్గే వార్ ఆశయ సాధనకు ముందుకు సాగాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, రామారావు పటేల్, కందకుర్తి సర్పంచ్ గియాజుద్దీన్, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>