Mobile Popup Ad
Mobile Popup Ad

రాష్ట్ర మహాసభలకు తరలిన రైతు సంఘం నాయకులు

కలం, కరీంనగర్ బ్యూరో: రైతాంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ రైతాంగ ఉద్యమాలకు దిక్సూచిగా తెలంగాణ రైతు సంఘం (Rythu Sangham) పనిచేస్తుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వర్ణ వెంకట్ రెడ్డి, కార్యదర్శులు మిల్కూరి వాసుదేవ రెడ్డిలు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కేంద్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడవ మహసభలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ (Karimnagar) జిల్లా నుంచి ఎంపికైన ప్రతినిధులు కొత్తగూడెం జిల్లా కేంద్రానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను మహాసభల్లో నిర్దేశించుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి పోరాట కార్యక్రమాలను రూపొందించనున్నట్లు తెలిపారు.

హామీలు అమలుపై  రైతు సంఘం విమర్శలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తెస్తూ వ్యవసాయ రంగాన్ని నష్టపరుస్తుందని విమర్శించారు. కరోనా కష్ట కాలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు రైతులు ఐక్య సమరశీల పోరాటం నిర్వహిస్తే, అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి నల్ల చట్టాలు రద్దు చేసిందని గుర్తు చేశారు. రైతాంగ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీలను నేటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. అన్ని రకాల పంటలకు మద్దతు ధరను చట్టబద్ధం చేస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు ఎలాంటి ఉపయోగం లేని విత్తన చట్టాన్ని తెచ్చారని, ఇది పూర్తిగా కార్పొరేట్లకు బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడుతుందన్నారు. విద్యుత్ సంస్కరణ చట్టంతో రైతాంగంపై మరింత ఆర్థిక భారంపడే అవకాశం ఉందన్నారు. ఈ చట్టం రైతులకు ఉచిత కరెంట్ అందకుండా చేసే కుట్రలో భాగమేనని ఆరోపించారు. సబ్సిడీలు ఎత్తివేసే ప్రమాదం ఉందన్నారు. యుద్దాల వల్ల రైతులు నష్టపోతున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ మోడీ ప్రభుత్వం.. మేము అధికారంలోకి వస్తే ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని, అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు కల్పిస్తామని, రైతుకు రెట్టింపు ఆదాయాన్ని ఇస్తామని హామీ ఇచ్చిందని, నేటికి హామీలు కలగానే మిగిలాయని అన్నారు.

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి..

అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు కల్పించి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. సన్న, చిన్నకారు రైతులకు ఎరువులు, పురుగుమందులు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఉపయోగం లేని కిసాన్ యాప్‌ను (Kisan App) తొలగించాలన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల రైతాంగ రుణాలు మాఫీ చేసి, వ్యవసాయానికి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పాలనలో ప్రొఫెసర్ జయతీ ఘోష్ కమిషన్ వేసిందని గుర్తు చేశారు. కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేశాయని మండిపడ్డారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి కౌలు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొనుగోలు సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రతినిధులు సంపత్ రావు, కానవేణి అరుణ, జూనూతుల జనార్దన్ రెడ్డి, శీలం అశోక్, చేల్పూరి రాములు, సీహెచ్ తిరుపతిరెడ్డి, గుండేటి వాసుదేవ్, ఎస్.చంద్రారెడ్డి, చంద్రశేఖర్, కాల్వ సురేష్, సంజీవరెడ్డి, రమేష్, తిప్పరపోయిన శ్రీకాంత్, మురళి తదితరులు పాల్గొన్నారు.

Read Also: “ఎవ‌డ్రా నువ్వు…” ఎవ‌రికి ఓటేశాడంటే..?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>