భారత రెజ్లింగ్ కోచ్‌గా షాకో బెంతినీడిస్ కంబ్యాక్ !

కలం, స్పోర్ట్స్: భారత రెజ్లర్లలో గెలిచే తపనను, ఛాంపియన్ క్యారెక్టర్‌ను నింపడమే తన లక్ష్యమని జార్జియాకు చెందిన ప్రముఖ కోచ్ షాకో బెంతినీడిస్ (Shako Bentinidis) ప్రకటించారు. గతంలో బజరంగ్ పునియాను ఒలింపిక్ మెడలిస్ట్ గా తీర్చిదిద్దిన షాకో, ఇప్పుడు భారత పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మంగళవారం జరిగిన ఇంటర్వ్యూ తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) ఈ నిర్ణయం తీసుకుంది.

భారత రెజ్లింగ్ (Indian Wrestling) చరిత్రలో తొలిసారిగా కోచింగ్ స్టాఫ్ మొత్తం విదేశీయులే ఉండబోతున్నారు. మహిళల జట్టుకు జపాన్‌కు చెందిన కోసీ అకైషి, గ్రీకో-రోమన్ విభాగానికి రష్యా కోచ్ గోగి కోగువాష్విలి, హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా అమెరికాకు చెందిన ఇయాన్ బట్లర్ మే నెలలో బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ కీలక సమయంలో షాకో (Shako Bentinidis) రాక ప్రాధాన్యత సంతరించుకుంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కేవలం అమన్ సెహ్రావత్ మాత్రమే అర్హత సాధించడంతో, భారత రెజ్లింగ్‌లో కనిపిస్తున్న స్తబ్దతను పోగొట్టాల్సిన అవసరం ఉందని షాకో భావిస్తున్నారు.

అమెరికాలో కోచ్‌గా పనిచేసిన అనుభవం తనకు మానసిక ఒత్తిడిని కలిగించిందని, అందుకే భారత్ పిలవగానే కాదనకుండా వచ్చానని షాకో చెప్పారు. భారత రెజ్లర్ల సత్తువపై తనకు నమ్మకం ఉందని, అయితే వారిలో ‘ఛాంపియన్ మైండ్‌సెట్’ లోపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం దేశంలోనే ప్రాక్టీస్ చేయడం వల్ల విదేశీ రెజ్లర్లను చూసి మనవారు భయపడుతున్నారని, అందుకే అంతర్జాతీయ క్యాంప్‌లు నిర్వహించడమే తన మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. రష్యా, అమెరికా వంటి దేశాల రెజ్లర్లతో తలపడితేనే భయం పోయి గెలుపుపై నమ్మకం పెరుగుతుందని ఆయన వివరించారు.

క్రమశిక్షణ విషయంలో తాను చాలా కఠినంగా ఉంటానని షాకో హెచ్చరించారు. గతంలో సోనేపట్ శిక్షణా కేంద్రంలో రెజ్లర్లు సరైన షూస్ లేకుండా రావడం, సాకులు చెప్పడం చూసి తాను ఆశ్చర్యపోయానని గుర్తు చేసుకున్నారు. కేవలం జిమ్ చేయడం, స్క్వాట్స్ తీయడం వల్ల ఫలితం ఉండదని.. టెక్నిక్ మీద దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఒక్కో టెక్నిక్‌ను వందల సార్లు ప్రాక్టీస్ చేయిస్తానని చెప్పారు. యువ రెజ్లర్ సుజీత్ కల్కల్ ఆటతీరు అద్భుతంగా ఉందని, అతనికి సరైన శిక్షణ ఇస్తే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ప్రమాదకరమైన ఆటగాడిగా మారుతాడని షాకో ధీమా వ్యక్తం చేశారు. భారత రెజ్లింగ్‌ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన ముగించారు.

Read Also: “ఎవ‌డ్రా నువ్వు…” ఎవ‌రికి ఓటేశాడంటే..?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>