కలం, వెబ్ డెస్క్: మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఆదివాసీ బిడ్డలకు హైదరాబాద్‌ను పరిచయం చేసేందుకు నిర్ణయించారు. ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ (Tribal Tourism Exposure Program) పేరుతో హైదరాబాద్ అందాలను చూపించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా గోండుగూడలో మంత్రి జూపల్లి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి విడతలో 5 ప్రత్యేక బస్సుల్లో 250 మంది ఆదివాసీలు హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని చార్మినార్, ట్యాంక్‌బండ్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, లుంబినీ పార్క్, మ్యూజియంను సందర్శించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి (Jupally Krishna Rao) మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లోని ఆదివాసీలు ఇప్పటికీ గొప్ప చదువులు చదువుకుంటున్నట్లు కనిపించడం లేదని చెప్పారు. వాళ్లను హైదరాబాద్‌కు తీసుకెళ్లి అక్కడి అభివృద్ధి చూపించడం ద్వారా నాగరిక ప్రపంచం అర్థం అవుతుందని చెప్పారు. ఇవన్నీ చూస్తే వాళ్ల పిల్లలు కూడా గొప్ప చదువులు చదువుకొని, ఇలాంటి ప్రదేశాల్లో ఉండాలన్న ఆలోచన వాళ్లలో కలగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఆలోచన మొదలైందిలా…
ఆదివాసీలకు హైదరాబాద్‌ను చూపించాలని మంత్రి జూపల్లి మనసులో ఏనాడో బీజం పడింది. గతంలో జూపల్లి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కుమ్మరికుంటలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆదివాసీలతో మాట్లాడారు. వారి జీవన శైలి, స్థానిక సమస్యలు తదితర అంశాల గురించి చర్చించారు. పలువురు ఆదివాసీలు తాము హైదరాబాద్ ఎప్పుడూ చూడలేదని మంత్రికి చెప్పారు. ఆదివాసీల మాటలు విన్న జూపల్లి ఆనాడే వారికి హైదరాబాద్‌ను చూపించాలని నిర్ణయించారు. ఈక్రమంలో గోండుగూడ, చెరువుగూడ పంచాయతీ పరిధిలోని ఆదివాసీలందరినీ విడతల వారీగా ప్రభుత్వ ఖర్చులతో హైదరాబాద్ పర్యటనకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా మొదటి విడతలో 250 మందిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
Read Also: కాళేశ్వరంపై హైకోర్టు తీర్పును తప్పుదోవపట్టిస్తున్నారు: ఎంపీ చామల
Follow Us On: X(Twitter)

