జిల్లా వ్యాప్తంగా కోతుల సమస్య.. త‌ప్ప‌నిసరి ప‌రిస్థితుల్లో వ‌రి సాగు..!

క‌లం, మెద‌క్ బ్యూరో : ఎల్‌నినో ప్రభావంతో (El Nino Impact) రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరి సాగుకు బదులుగా పంటల మార్పిడి చేసి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయడానికి గ్రామాల్లో పెరుగుతున్న కోతుల సమస్య రైతులను వెనక్కి నెడుతోంది. ప్రస్తుతం వరి కాకుండా ఏ పంట వేసినా, పంట చేతికి వచ్చే వరకు దానిని కాపాడుకోవడం రైతులకు పెద్ద సవాలుగా మారింది. కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపితేనే రైతులు ధైర్యంగా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు అడుగులు వేయగలరని చెబుతున్నారు.

ప్రచారం ఒకటి.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరొకటి

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల మార్పిడి చేపట్టి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం, మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరికి బదులుగా మొక్కజొన్న, జొన్నలు, వేరుశెనగ, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు.

అయితే రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కోతుల సమస్యతో పాటు అడవి పందులు, పక్షులు, నెమళ్లు వంటి వన్యప్రాణుల బెడద కారణంగా వెనుకడుగు వేస్తున్నారు. మొక్కజొన్న, వేరుశెనగ, కూరగాయలు, తృణధాన్యాలు వంటి పంటలను కోతులు పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వరి మినహా ఇతర పంటల సాగు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

మెదక్ జిల్లా పరిస్థితి ఇందుకు నిదర్శనం

కోతుల సమస్య తీవ్రతను చెప్పడానికి మెదక్ ( Medak ) జిల్లా పరిస్థితి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. జిల్లాలో మొత్తం 2,91,399 మంది రైతులు ఉన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 3.68 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగును లక్ష్యంగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందులో వరి 3,16,690 ఎకరాలు, పత్తి 36 వేల ఎకరాలు, మొక్కజొన్న 3 వేల ఎకరాలు, కందులు 1,850 ఎకరాలు, పెసర 1,250 ఎకరాలు, మినుములు 700 ఎకరాల్లో సాగు చేయాలని ప్రణాళిక రూపొందించారు. అయితే మెదక్ జిల్లాలో ఖరీఫ్, యాసంగి సీజన్లలో దాదాపు 88 శాతం మేర రైతులు వరినే సాగు చేస్తున్నారు. దీనికి నీటి వసతి ఒక కారణమైతే, కోతుల సమస్య మరో ప్రధాన కారణంగా నిలుస్తోంది.

అడవుల సమీపంలో పంటలకు తీవ్ర నష్టం

మెదక్, నర్సాపూర్ ప్రాంతాల్లో అడవుల విస్తీర్ణం అధికంగా ఉండటంతో అనేక గ్రామాలు అడవులను ఆనుకుని ఉన్నాయి. వ్యవసాయ భూములు అడవులకు సమీపంలో ఉండటంతో కోతులు, అడవి పందులు, పక్షులు, నెమళ్లు తరచూ పంటలను నాశనం చేస్తున్నాయి. గ్రామాల్లో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, కొన్ని సందర్భాల్లో అవి మనుషులపై కూడా దాడులు చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వరి కాకుండా ఇతర పంటలు వేస్తే పంటను రాత్రింబవళ్లు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, చివరకు దిగుబడి వస్తుందన్న హామీ కూడా ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో వరి సాగు

ఇతర పంటలతో పోలిస్తే వరిపై కోతులు, అడవి పందుల ప్రభావం కొంత తక్కువగా ఉండటంతో రైతులు నీటి కొరత ఉన్నప్పటికీ వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. వర్షాలు తక్కువగా కురుస్తాయని తెలిసినా, వర్షాల కోసం వేచి చూసి వరినే సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. మార్కెట్లో మొక్కజొన్న, వేరుశెనగ, చిరుధాన్యాలకు మంచి ధరలు ఉన్నప్పటికీ, కోతుల బెడద కారణంగా రైతులు వాటి సాగుకు ఆసక్తి చూపడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయిల్ పామ్ వంటి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నప్పటికీ, వాటి నుంచి ఆదాయం రావడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుండటంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి కోతుల కారణంగా తీవ్ర నష్టాలు చవిచూశారు.

వరి వైపే రైతుల మొగ్గు

ఇటీవలి కాలంలో రైతుల ఆలోచనా విధానంలో కూడా మార్పు వచ్చింది. ఇతర పంటలతో పోలిస్తే వరి సాగు తక్కువ శ్రమతో పూర్తవుతుందనే భావన రైతుల్లో పెరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేస్తుందనే నమ్మకం కూడా రైతులను వరి సాగు వైపే మళ్లిస్తోంది. ఇతర పంటలు సాగు చేయాలంటే సకాలంలో నిర్వహణ, అధిక శ్రమ, మార్కెట్‌పై ఆధారపడాల్సి వస్తుండగా, వరి సాగులో అలాంటి ఇబ్బందులు తక్కువగా ఉంటాయని రైతులు భావిస్తున్నారు. దీనికి తోడు కోతుల వల్ల నష్టం కూడా తక్కువగా ఉండటంతో వరి సాగునే సురక్షితమైన ఎంపికగా చూస్తున్నారు.

కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరం

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఎంత చర్చ జరుగుతోందో, అదే స్థాయిలో కోతుల సమస్య కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మంత్రులు, అధికారులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లోనూ ప్రజాప్రతినిధులు, రైతులు కోతుల సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. గతంలో వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు ప్రస్తుతం కోతుల బెడద కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వరి సాగు చేస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం కోతుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, పంటలను రక్షించే చర్యలు చేపడితేనే ప్రత్యామ్నాయ పంటల సాగు చేస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.

పంటల మార్పిడి విజయవంతం కావాలంటే కేవలం అవగాహన కార్యక్రమాలు సరిపోవని, రాష్ట్రవ్యాప్తంగా కోతుల సమస్యపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>