కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో రైతులకు, శాస్త్రవేత్తలతో వ్యవసాయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా “రైతు ముంగిట శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి. భరత్ తెలిపారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 27 నుండి మే 24 వరకు జిల్లాలోని 23 మండలాల్లో నిర్వహించబడనుందన్నారు.
ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ, తక్కువ యూరియాను వినియోగించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. అవసరానికి మించిన రసాయనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రకృతి సమతౌల్యాన్ని పరిరక్షించవచ్చని సూచించారు. పంట మార్పిడి విధానాలను అనుసరించడం ద్వారా సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని వివరించారు.
మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలను ఎంపిక చేసుకొని సాగు చేస్తే అధిక ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. సాగునీటిని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి వనరులను అందించగలమని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి సాధ్యమవుతుందని వివరించారు. రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని శాస్త్రవేత్తల సూచనలను అనుసరించడం ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి. భరత్ సూచించారు.

